దుబాయ్ వ్యాపారవేత్తతో పూర్ణ పెళ్లి
మలయాళ నటి పూర్ణ పెళ్లి దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్తతో జరిగింది. సినీ రంగంలో పూర్ణగా గుర్తింపు పొందిన షమ్నా కాసిం దుబాయ్‌లో స్థిరపడిన జేబీఎస్ గ్రూప్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో షానిద్ ఆసిఫ్ అలీని పెళ్లి చేసుకున్నారు. తమ పెళ్లి సోమవారం దుబాయ్‌లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఇస్లాం సాంప్రదాయం ప్రకారం జరిగిందని, పెళ్లి తర్వాత రిసెప్షన్ కూడా అయిందంటూ పూర్ణ తన ఇన్‌స్టాగ్రమ్‌లో పెళ్లి ఫొటోలు షేర్ చేశారు. ‘శ్రీ మహాలక్ష్మి’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన పూర్ణ ‘అవును’, ‘అవును 2’ సినిమాలతో తెలుగు సినీ రంగంలో గుర్తింపు పొందింది. ‘సీమ టపాకాయ్’, ‘సిల్లీ ఫెలోస్’, ‘అదుగో’, ‘రాజుగారి గది’, ‘మామ మంచు అల్లుడు కంచు’ తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది.

మే నెలలో నిశ్చితార్ధం..
టీవీ షోలతోనూ బిజీగా ఉన్న పూర్ణ అలియాస్ సామ్న కాసీం నిశ్చితార్ధం మే నెలలో ఆసిఫ్ అలీతో జరిగింది. అయితే.. తర్వాత వాళ్ల మధ్య విభేదాలు తలెత్తాయని.. పెళ్లి క్యాన్సిల్ అయిందని వదంతులొచ్చాయి. కానీ.. అనూహ్యంగా సోమవారం రాత్రి తమ పెళ్లి అయిందంటూ పూర్ణ ఫొటోలు షేర్ చేయడంతో ఆమె అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఆమెకు సినీ ప్రముఖులు, నెటిజన్లు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. మలయాళం, తెలుగు, తమిళం, కన్నడం కలిపి 40కి పైగా సినిమాల్లో పూర్ణ నటించింది. ఈ సందర్భంగా ఆమె తన భర్తను ఉద్దేశించి రోమాంటిక్ విషయాలు రాసుకొచ్చారు.

మీరు నన్నెంతో ప్రోత్సహించారు..
‘నేను ప్రపంచంలోనే అత్యంత అందమైన స్త్రీని కాకపోవచ్చు. మంచి జీవిత భాగస్వామికి ఉండాల్సిన లక్షణాలు కూడా నాలో లేకపోవచ్చు. కానీ.. మీరు నన్ను ఏనాడూ తక్కువగా చూడలేదు. మీరు నన్ను నన్నుగానే ఆరాధించారు. నన్ను మార్చడానికి ఎన్నడూ ప్రయత్నించ లేదు. నాలోని ఉత్తమ ప్రతిభను బయటికి తీసుకొచ్చేందుకు మీరు నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఈ రోజు మనకెంతో ప్రియమైన, దగ్గరైన వారి మధ్య మీరూ.. నేనూ కలిసి ఈ అద్భుత ప్రయాణాన్ని ప్రారంభించాం. ఎలాంటి కఠిన పరిస్థితుల్లో అయినా మీకు నేను అండగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాను’ అని తన భర్తను ఉద్దేశించి రాసిన వ్యాక్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

