విశాఖలో అసలేం జరిగింది?
విశాఖ గర్జనతో ఉద్రిక్తతలు మొదలు
పవన్ కల్యాణ్ ఎంట్రీతో రచ్చరచ్చ
ఎయిర్‌పోర్టుకు పోటెత్తిన జనసైనికులు
వైసీపీ నేతలను వెంబడించిన కార్యకర్తలు
దాడిలో గాయపడ్డ వైసీపీ కార్యకర్త
70 మంది వైసీపీ కార్యకర్తల అరెస్టు
61 మందికి కోర్టు బెయిల్ మంజూరు
గొడవలకు వైసీపీ ప్లాన్ చేస్తోందన్న పవన్
ప్రశాంత నగరం విశాఖపట్టణం ఇప్పుడు రాజకీయ దుమారానికి కారణమవుతోంది. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకురావడంతో విశాఖపై అందరి దృష్టి పడింది. అమరావతి ఏకైక రాజధాని అంటూ అటు టీడీపీ, ఇటు రైతులు ఆందోళనలు చేస్తున్నా.. జగన్ సర్కారు మాత్రం మూడు రాజధానులపై ముందడుగేయాలని చూస్తోంది. ఓవైపు న్యాయపరమైన చిక్కులు ఎదురవడంతో ఎలా అడుగులు వేయాలో అర్థం కాని పరిస్థితిలోకి ప్రభుత్వం వెళ్లింది. అయితే ఏడాదిన్నరలో ఎన్నికలు రానుండటంతో… వైజాగ్ రాజధానిపై దూకుడు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఓవైపు అమరావతి -అరసవిల్లి పేరుతో అమరావతి రైతులు మహాపాదయాత్ర చేస్తున్న తరుణంలో ఏపీలో అనేక అంశాలు తెరపైకి వచ్చాయ్. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును ప్రభుత్వం వైఎస్సార్ హెల్త్ వర్శిటీగా మార్చింది. ఆ వ్యవహారంపై రాజకీయ దుమారం రేగుతున్న సమయంలో అమరావతి రైతుల పాదయాత్ర విశాఖ దిశగా అడుగులేస్తున్న తరుణంలో జరిగిన విశాఖ గర్జన ఉద్రిక్తతలకు కారణమైంది. నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన విశాఖ గర్జనతో రగడ మొదలైంది. రాష్ట్రానికి మేలు జరిగేలా… జగన్ సర్కారు మూడు రాజధానులతో అడుగులు వేస్తుంటే.. టీడీపీ కావాలని అమరావతి రైతులను రెచ్చగొడుతుందని సభ సాక్షిగా మంత్రులు ఆరోపించారు. వికేంద్రీకరణతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని… ఏ ఒక్క ప్రాంతంపైనా ప్రభుత్వానికి వివక్షలేదంటూ మంత్రులు గర్జించారు. అయితే సభ పూర్తయ్యాక తిరిగి వెళ్తున్న మంత్రుల వాహనాలపై దాడికి తెగబడ్డారని వైసీపీ ఆరోపించింది. మంత్రులను టార్గెట్ చేసుకున్నారని విమర్శించింది.

కచ్చితంగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ విశాఖ వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. కేసులో ప్రమేయం ఉన్న పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. విశాఖ వచ్చిన పవన్ కల్యాణ్ ఇక హోటల్ చేరుకునే సమయంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు ఎయిర్ పోర్టుకు రావడంతో ర్యాలీగా పవన్ కల్యాణ్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ర్యాలీగా హాటల్ వద్దకు బయల్దేరడంతో నగరమంతా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాస్తవానికి ర్యాలీకి ఎలాంటి అనుమతి లేకపోయినా కార్యకర్తలు పోటెత్తారని పోలీసులు వివరించారు. జనసేన కార్యకర్తల దాడిలో రోజా గాయపడి ఉంటే ఇక కథ వేరేలా ఉండదని వైసీపీ నేతలు మాట్లాడటం కూడా చూశాం. ఇక జనసైనికుల ఆగడాలను చూస్తూ ఊరుకోమంటూ వైసీపీ నేతలు వార్నింగ్‌లు సైతం ఇచ్చారు.
ఇక వైసీపీ వర్సెస్ జనసేన రచ్చ ఉద్రిక్తమవుతుండటంతో.. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. నోవాటెల్ హోటల్ నుంచి పవన్ కల్యాణ్‌ను అడగు బయటకు పెట్టనివ్వలేదు. వైసీపీ ప్రభుత్వ స్పందన కార్యక్రమం వల్ల ప్రయోజనం కలగడం లేదని… జనసేన ఆరోపిస్తోంది. అందుకు బదులుగా జనవాణి కార్యక్రమాన్ని చేపట్టి… ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నామంటోంది. ప్రజల నుంచి తీసుకున్న ఆర్జీలను సంబంధిత అధికారుల దృష్టికి జనసేన తీసుకెళ్తోంది. అధికారులకు లెటర్లు రాస్తూ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారు. పవన్ కల్యాణ్ నిర్వహించాల్సిన జనవాణి కార్యక్రమం వేదిక వద్ద పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు రావడంతో అక్కడ వాతావరణం మారిపోయింది.

కాసేపట్లో జనసే కార్యక్రమం నిర్వహించాల్సిన సమయంలో వైసీపీ కార్యకర్తలు చేరుకోవడంతో ఏదైనా అనుకోని ఘటన జరుగుతుందని పోలీసులను భావించారు. అప్పటికే జనసేన కార్యకర్తలు ఎయిర్ పోర్టులో మంత్రి రోజాను వెంబడించడంతో మరింత గొడవ జరుగుతుందని భావించిన పోలీసులు పవన్ కల్యాణ్ హౌస్ అరెస్ట్ చేశారు. అంతే కాకుండా ఈనెల 30 వ తారీఖు వరకు విశాఖ రావొద్దని నోటిస్ ఇష్యూ చేశారు. సెక్షన్ 30 అమల్లో ఉందని వివరించారు. వైసీపీ కార్యకర్తలు అప్పటికే పోర్టు స్టేడియం వద్ద మోహరించడంతో మొత్తం వ్యవహారం చినికి చినికి గాలివానల మారుతుందని భావించి.. జనసేన సైతం కార్యక్రమాన్ని రద్దు చేసుకొంది. అరెస్టు చేసిన జనసేన కార్యకర్తలందరినీ బేషరతుగా రిలీజ్ చేస్తే తాను వైజాగ్ నుంచి వెళ్లి పోతానని పవన్ కల్యాణ్ పోలీసులకు స్పష్టం చేశారు. జనసేన కీలక నేతలపై పోలీసులు హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. తమ పార్టీ నేతలను హత్యాయత్నం కేసుల్లో ఇరికించి బయటకు రాకుండా చేయాలని చూస్తున్నారని పవన్ విమర్శించారు. గొడవపెట్టుకోడానికి రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు. దీంతో శనివారం సాయంత్రం మొదలైన డ్రామా సోమవారం మధ్యాహ్నం వరకు కొనసాగింది. మొత్తం వ్యవహారంలో పవన్ కల్యాణ్ కు టీడీపీ అధినేత బాసటగా నిలిచారు. నేరుగా ఫోన్ చేసి ప్రజల కోసం పోరాడుతున్నవారు భయపడాల్సిన పని లేదని చెప్పుకొచ్చారు. జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్న పవన్ కల్యాణ్ పై ఆంక్షలు సరికాదన్నారు.

