సౌదీ, కువైట్ స్వదేశీ జపం.. ప్రవాసులకు ఇక కష్టాలే..
గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, కువైట్ స్వదేశీ జపం అందుకున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల ఉద్యోగాల్లో స్వదేశీయులకే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించాయి. డిసెంబరు 17వ తేదీ నుంచి అన్ని శాఖల్లో స్థానికీకరణను అమలు చేస్తామని సౌదీ మానవ వనరులు, సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం విదేశీయులు పని చేస్తున్న రంగాల్లో సౌదీలకు రిజర్వేషన్లు కల్పించి మరీ చేర్చుకుంటామని తెలిపింది. దీంతో ప్రవాసులకు ఇక కష్టాలేనని అంటున్నారు.

డిసెంబరు తర్వాత వెనక్కి రావాల్సిందే..
తొలుత కస్టమర్ సర్వీసుల్లో సౌదీలకు పెద్దపీట వేస్తామని.. తర్వాత లీడర్‌షిప్, పర్యవేక్షణ, మెయిల్, పార్శిల్ ట్రాన్స్‌పోర్ట్ రంగాల్లో స్థానికులను చేర్చుకుంటామని సౌదీ మంత్రి అహ్మద్ అల్ రాఝీ చెప్పారు. దీంతో సౌదీ అరేబియాలో ఉద్యోగాలు చేస్తున్న ప్రవాసులు డిసెంబరు తర్వాత మూటాముల్లే సర్దుకొని స్వదేశానికి రావాల్సిందేనని భయపడుతున్నారు. దేశవ్యాప్తంగా వరుస తనిఖీలు చేస్తున్న అధికారులు సౌదీ అరేబియాలో అక్రమంగా నివసిస్తున్న 16 వేల మందిని అరెస్టు చేసి స్వదేశానికి పంపించారు.

కువైటైజేషన్‌తో చుక్కలే..
స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కువైటైజేషన్ పాలసీని ప్రారంభించిన కువైట్ సర్కారు 6 నెలల్లో 10 వేల మందికి పైగా కువైటీలను ప్రభుత్వ ఉద్యోగాల్లో చేర్చుకుంది. రెసిడెన్సీ వీసా, వర్క్ పర్మిట్ల జారీ, పునరుద్ధరణకు కఠిన షరతులు విధిస్తూ వలసదారులకు చుక్కలు చూపిస్తోంది. 2023 నాటికి వసలదారులను దేశం నుంచి భారీ స్థాయిలో పంపించేందుకు కువైట్ సివిల్ సర్వీస్ కమిషన్ పకడ్బందీ ప్రణాళికను సిద్ధం చేసింది. అంతగా అవసరంలేని ఉద్యోగాల్లో ప్రవాసులకు వర్క్ పర్మిట్లను పునరుద్ధరించొద్దని నిర్ణయించింది. మార్కెట్‌లో అవసరమైన ఉద్యోగాలకు మాత్రమే వర్క్ పర్మిట్‌లను జారీ చేయనుంది.

