NationalNews

బిగ్ బాస్ షో కోసం సల్మాన్ ఖాన్‌కు వెయ్యి కోట్లు

బిగ్ బాస్ 16 కోసం సల్మాన్ ఖాన్ వెయ్యి కోట్ల రూపాయలు అడిగారని బాలీవుడ్ అంతా ప్రచారం జరుగుతోంది. ఐతే మొత్తం వ్యవహారాన్ని ఖండించారు సల్మాన్ ఖాన్. మీడియా సమావేశంలో మాట్లాడిన సల్మాన్ ఖాన్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈవెంట్ సందర్భంగా బిగ్ బాస్ 16 గాయకుడు అబ్దు రోజిక్ మొదటి కంటెస్టెంట్‌ని పరిచయం చేసిన సల్మాన్ ఖాన్… షో కోసం 1000 కోట్లంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. మీడియాలో వస్తున్న పుకార్లను ఆయన ఖండించారు. PTI వార్త సంస్థకు మొత్తం విషయాన్ని వెల్లడించాడు. ఒకవేళ అంత మొత్తంలో చార్జ్ చేస్తే… ఇక జీవితంలో పనిచేయాల్సి అవసరం లేదన్నాడు.

బిగ్ బాస్ షో కోసం జరుగుతున్న వెయ్యి కోట్ల ప్రచారాన్ని గమనిస్తున్నానన్న సల్మాన్ అవన్నీ తప్పుడు ప్రచారాలని కొట్టిపారేశారు. ఒకవేళ అలాంటి ఆఫర్ ఏదైనా ఉంటే ఆ డబ్బు ఎలా ఇస్తారన్నాడు. అలాంటి డిమాండ్ ఉంటే… కలర్స్ చానెల్ సైతం పూర్తిగా లాభాల్లో ఉంటుందన్నారు. ఒకవేళ అంత పెద్ద మొత్తంలో లభిస్తే… లాయర్ల ఫీజులులా అనేక ఖర్చులుంటాయన్నారు. ఇదిగో సల్మాన్ సంపాదిస్తాడు, ఇదిగో సల్మాన్ ఇస్తాడు. ఇది వస్తుంది, ఇది పోతుందంటూ వచ్చే రూమర్లతో ఆదాయపు పన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వారు కూడా వస్తారన్నారు. కానీ వారికి వాస్తవం తెలుసునన్నారు సల్మాన్ ఖాన్.

బిగ్ బాస్ షోను 12 ఏళ్లుగా హోస్ట్ చేస్తున్నానన్న సల్మాన్… ఇందుకు తగిన విధంగా ప్రిపేర్ అయిపోయానన్నారు. ఆట అంటే ఇష్టమని… ఇంకా నేర్చుకోవలసింది చాలా ఉందన్నారు. నాలుగు నెలల కాలంలో ఎంతగానో నేర్చుకుంటామన్నారు. 2010 నుండి బిగ్ బాస్ హోస్ట్ చేస్తున్న సల్మాన్ ఖాన్ టీవీ రియాలిటీ షో కొత్త సీజన్ గురించి క్లారిటీ ఇచ్చాడు. షోలో ఏం జరుగుతుందో తెలియదన్న సల్మాన్ ఏం జరిగినా అది మంచికేనన్నారు. ఈసారి షో భిన్నంగా విభిన్నంగా, వేగంగా, అనూహ్యంగా ఉంటుందన్నారు. హిందీలో సూపర్ డూపల్ హిట్టయిన బిగ్ బాస్ షోకు ఇప్పటి వరకు సల్మాన్ ఖాన్‌తోపాటుగా అమితాబ్ బచ్చన్, శిల్పాశెట్టి, అర్షద్ వార్సీ వంటి స్టార్లు హోస్ట్‌‌లుగా వ్యవహరించారు. గత సీజన్‌లో టీవీ నటి తేజస్వి ప్రకాష్ విజేతగా నిలిచారు.