ఉప్పల్‌లో టీ20 మ్యాచ్‌పై నీలినీడలు
భారత్, ఆస్ట్రేలియాల మధ్య ఆదివారం టీ20 మ్యాచ్ ఉప్పల్‌లో జరుగుతుందా..? టికెట్ల విక్రయంలో గందరగోళం, తొక్కిసలాటలో పలువురు గాయపడటం.. తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం చెందడం.. తదితర కారణాల నేపథ్యంలో ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌పై నీలినీడలు అలుముకున్నాయి. టికెట్ల విక్రయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) వ్యవహారంపై గుర్రుగా ఉన్న బీసీసీఐ మూడో టీ20 మ్యాచ్‌ను మరో చోటుకు మార్చాలని ఆలోచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే.. హెచ్‌సీఏ మాత్రం మ్యాచ్ సజావుగా జరుగుతుందని భరోసా ఇస్తోంది.

అజారుద్దీన్ ఒంటెత్తు పోకడ..
హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ ఒంటెత్తు పోకడతోనే సమస్యలొచ్చాయని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్లో ఆరుగురు సభ్యులుంటారు. అజరుద్దీన్ మాత్రం ఎవరినీ దగ్గరికి రానీయకుండా వన్‌మ్యాన్ షో చేయడం వల్లే అసోసియేషన్ విమర్శల పాలైందని తెలుస్తోంది. హెచ్‌సీఏ కార్యవర్గంలో ఇద్దరే ఉండటం వల్ల అన్ని పనులు సరిగ్గా జరగడం లేదని క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా చెప్పడం గమనార్హం.

టికెట్లన్నీ ఏమయ్యాయి..?
ఉప్పల్ స్టేడియం సామర్థ్యం 39 వేల సీట్లు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీసులు, ఉన్నతాధికారులు, ప్రభుత్వ సంస్థల సిబ్బంది, ఇతర ప్రముఖులకు కలిపి 9 వేల పాస్‌లు ఇస్తారు. మిగిలిన 30 వేల టికెట్లను అభిమానులకు విక్రయించాలి. అయితే.. అజారుద్దీన్ ఒక్కరే 10-12 వేల టికెట్లు తీసుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా భారీగానే టికెట్లు తీసుకున్నారట! 10-15 వేల టికెట్లు మాత్రమే ‘పేటీఎం’ ద్వారా విక్రయించారని.. అవి కూడా క్షణాల్లోనే అమ్ముడుపోయాయని తెలుస్తోంది. మిగిలిన టికెట్లు ఏమయ్యాయో హెచ్‌సీఏ చెప్పడం లేదు.

హెచ్‌సీఏ అధికారులపై కేసులు..
జింఖానా మైదానంలో గురువారం నాటి తొక్కిసలాటకు కారకులంటూ హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్‌పై, అసోసియేషన్ ప్రతినిధులపై మూడు కేసులు నమోదు చేసినట్లు హైదరాబాద్ పోలీసు అధికారులు ప్రకటించారు. గాయపడిన వారి ఫిర్యాదు మేరకు కేసు పెట్టామన్నారు. టికెట్లను బ్లాక్‌లో అమ్ముకున్నారనే ఆరోపణలపై 420, 21, 22సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.

అంతా పారదర్శకమే: అజారుద్దీన్
అయితే.. టికెట్లను తాము బ్లాక్ చేయలేదని హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ వివరణ ఇచ్చారు. అంతా పారదర్శకంగానే చేస్తున్నామని చెప్పారు. తొక్కిసలాటలో గాయపడిన వారి చికిత్సకు అయ్యే ఖర్చును హెచ్‌సీఏ భరిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ మ్యాచ్‌కు సంబంధించి ఎవరికీ కాంప్లిమెంటరీ పాస్‌లు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. తొక్కిసలాటలో తమ తప్పు లేదని, పోలీసులకు ముందే సమాచారం ఇచ్చామని వివరణ ఇచ్చారు.

