Andhra PradeshNews

ఎన్టీయార్‌ కంటే వైఎస్సార్‌ ఎందులో గొప్ప..?

ఎన్టీయార్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును మార్చొద్దని కోరుతూ ఏపీ గవర్నర్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం వినతిపత్రం ఇచ్చారు. జగన్‌ సర్కారు అసెంబ్లీలో మంద బలంతో పేరు మార్పు బిల్లును ఏకపక్షంగా ఆమోదించుకుందని.. ఈ చీకటి బిల్లుపై సంతకం చేయొద్దని.. చట్టరూపం దాల్చకుండా చూడాలని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కోరారు. అనంతరం చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ.. జగన్‌.. రాత్రి వాళ్ల నాన్న ఆత్మతో మాట్లాడి యూనివర్సిటీ పేరు మార్చారా? అని వ్యంగ్యంగా ప్రశ్నించారు? ఎన్టీయార్‌ కంటే వైఎస్సార్‌ ఎందులో గొప్ప..? అని నిలదీశారు. వైఎస్సార్‌, జగన్‌ల హయాంలో ఎన్ని మెడికల్‌ కాలేజీలు వచ్చాయో చెప్పాలన్నారు. సినీ, రాజకీయ రంగాల్లో ప్రత్యేక ముద్ర వేసుకున్న ఎన్టీయార్‌ తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తారని చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్‌ అబద్ధాలు చెప్పారని.. పేరు మార్పు సమాచారాన్ని హెల్త్‌ యూనివర్సిటీకి ఛాన్సలర్‌గా ఉన్న గవర్నర్‌కే చెప్పకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్టీయార్‌కు జరిగిన అవమానాన్ని తెలుగు జాతికి జరిగినట్లు భావిస్తున్నామని.. హెల్త్‌ యూనివర్సిటీకి మళ్లీ ఎన్టీయార్‌ పేరు పెట్టే వరకూ పోరాడతామని స్పష్టం చేశారు.