దేశవ్యాప్తంగా ఎన్ఐఏ దాడులు.. పీఎఫ్ఐ నాయకుల అరెస్టు
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) కార్యకర్తలు, నాయకులే లక్ష్యంగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించింది. గురువారం తెల్లవారుజామున చేపట్టిన ఈ దాడుల్లో పీఎఫ్ఐకు అందుతున్న ఆదాయం, ఉగ్రవాదులకు ఇస్తున్న శిక్షణకు సంబంధించిన వివరాలపై ఆరా తీసింది. పలు రాష్ట్రాల్లో 105 మందికి పైగా పీఎఫ్ఐ నాయకులను అదుపులోకి తీసుకుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్, ఘట్కేసర్ ప్రాంతాలు, గుంటూరులోని ఆటోనగర్, కరీంనగర్లో 8 ప్రాంతాలు, కర్నూలులోని ఖడక్‌పురా వీధితో పాటు కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కేరళ, బీహార్, రాజస్థాన్, ఢిల్లీ తదితర 13 రాష్ట్రాల్లోనూ పీఎఫ్ఐ కార్యకర్తల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు.

పీఎఫ్ఐ ప్రధాన కార్యాలయం సీజ్..
చాంద్రాయణగుట్టలోనీ పీఎఫ్ఐ ప్రధాన కార్యాలయాన్ని సీజ్ చేశారు. ధార్మిక కార్యకలాపాల పేరుతో మత విద్వేశాలు రెచ్చగొడుతున్నారని, వ్యాయామం, శారీరక దారుఢ్యం పేరుతో ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నారన్న నెపంతో పలువురిని అరెస్టు చేశారు. తొలుత నిజామాబాద్ జిల్లాలో పీఎఫ్ఐ కార్యకర్తలపై కేసు నమోదు చేసిన పోలీసులు అనంతరం ఈ కేసును ఎన్ఐఏకు బదిలీ చేశారు. పీఎఫ్ఐ చీఫ్ పర్వేజ్‌ను, అతడి సోదరుడిని ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. ఈ సోదాల్లో ఎన్ఐఏతో పాటు ఈడీ, స్థానిక పోలీసులు 200 మందికి పైగా పాల్గొన్నారు.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలోనే..
ఈ ఆపరేషన్‌ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నేరుగా పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్ఐఏకు వ్యతిరేకంగా కర్ణాటకలో ఆందోళన చేస్తున్న పీఎఫ్ఐ, ఎస్డీపీఐ సభ్యులను మంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. కేరళలోని మల్లపురం జిల్లా మంజేరిలోని పీఎఫ్ఐ చైర్మన్ సలాం ఇంట్లో అర్ధరాత్రి నుంచి తనిఖీలు జరిపారు. ఈ దాడులు కేంద్ర ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని పీఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ సత్తార్ విమర్శించారు.

దేశీయంగా విరాళాలు అందించిన 600 మందికి పైగా బ్యాంకు ఖాతాలను ఈడీ తనిఖీ చేసింది. 2,600 మందికి పైగా లబ్ధిదారుల ఖాతాలను పరిశీలించింది. యూపీలో ఇటీవల అరెస్టు చేసిన అన్షద్ బసేదీన్ వద్ద పిస్టళ్లు, తూటాలు, ఐఈడీలను ఉగ్రవాద నిరోధక బృందం స్వాధీనం చేసుకుంది. అతడి బ్యాంకు అకౌంట్‌కు పీఎఫ్ఐ రూ.3.5 లక్షలు బదిలీ చేసిందని ఈడీ తన చార్జిషీట్లో పేర్కొన్నది.

