National

పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి భారీ విజయం

రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ- ఎక్ నాథ్ షిండే ఆధ్వర్యంలోని శివసేన నేతలు భారీ విజయాలను సొంతం చేసుకున్నారు. బీజేపీ నుంచి 259 మంది అభ్యర్థులు, శివసేనకు చెందిన ఏక్‌నాథ్ షిండే వర్గం మద్దతుతో 40 మంది అభ్యర్థులు సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారని బీజేపీ మహారాష్ట్ర విభాగం అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే ప్రకటించారు. రాష్ట్రంలోని 16 జిల్లాల్లోని 547 గ్రామ పంచాయతీలకు ఆదివారం జరిగిన ఎన్నికల్లో 76 శాతం పోలింగ్ నమోదైంది. వాస్తవానికి ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరిగాయ్. గ్రామ పంచాయతీల ఎన్నికలతో పాటు గ్రామ సర్పంచ్‌ల పదవులకు కూడా ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. మహారాష్ట్ర గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి భారీ విజయం సాధించింది.

259 మంది భారతీయ జనతా పార్టీ మద్దతు ఉన్న అభ్యర్థులు సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారని ఆ పార్టీ పేర్కొంది. అదే సమయంలో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గం మద్దతుతో 40 మంది నామినీలు కూడా సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారని బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాన్‌కులే తెలిపారు. మొత్తంగా కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లలో 50 శాతానికి పైగా షిండే-బీజేపీ కూటమికి మద్దతుదారులేనన్నారు. ప్రజలకు షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వంపై మహారాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని గ్రామపంచాయితీ ఎన్నికలు ధృవీకరించాయన్నారు. జూన్ నెలాఖరులో అధికారం చేపట్టిన షిండే నేతృత్వంలోని ప్రభుత్వంలో బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటా ఎగురవేసిన షిండే బీజేపీ మద్దతుతో 39 మంది ఎమ్మెల్యేలతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.