Andhra PradeshNews

27 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఈ నెల 27 నుంచి అక్టోబరు 5వ తేదీ వరకు నాలుగు మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో ఎ.వి.ధర్మారెడ్డి తెలిపారు. నాలుగు మాడ వీధుల్లో ఉండే ప్రతి భక్తుడికి సంతృప్తికరంగా వాహన సేవల దర్శనం కల్పించేందు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తిరుమల అన్నయ్య భవనంలో శనివారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ చేపట్టిన పలు కార్యక్రమాల గురించి ఈవో వివరించారు. ఈ నెల 20వ తేదీన ఉదయం 6 నుంచి 11 గంటల వరకు ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తామని చెప్పారు.

26వ తేదీన రాత్రి 7 నుంచి 8 గంటల వరకు అంకురార్పణ జరుగుతుందన్నారు. 27వ తేదీన తొలి రోజు సాయంత్రం 5.45 నుంచి 6.15 గంటల వరకు మీన లగ్నంలో ధ్వజారోహణం, రాత్రి 9 నుంచి 11 గంటల వరకు పెద్ద శేష వాహనం నిర్వహిస్తామని చెప్పారు. ధ్వజారోహణం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం వైఎస్‌ జగన్‌ పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు. కొవిడ్‌ వల్ల గత రెండేళ్లుగా నాలుగు మాడ వీధుల్లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించలేకపోయామని చెప్పారు. స్వామి వారి వాహన సేవలు రోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు.. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు జరుగుతాయి.

అక్టోబరు 5వ తేదీన తొమ్మిదో రోజు ఉదయం 6 గంటలకు చక్రస్నానం, రాత్రి 9 నుంచి 10 గంటల వరకు ధ్వజారోహణం నిర్వహిస్తారు. భక్తుల రద్దీ నేపథ్యంలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లలు తల్లిదండ్రులు, ఎన్‌ఆర్‌ఐలు, రక్షణ సిబ్బందికి ప్రత్యేక దర్శనం తదితర ప్రత్యేక సదుపాయాలను రద్దు చేశారు. ఆర్జిత సేవలు, రూ.300 దర్శన టికెట్లతో పాటు శ్రీవాణి ట్రస్టు దాతలకు, ఇతర ట్రస్టుల దాతలకు దర్శన టికెట్లు రద్దు చేశారు. గదులను భక్తులు ఆన్‌లైన్‌లో 50 శాతం డబ్బులిచ్చి బుక్‌ చేసుకునే అవకాశం కల్పించారు.