మోదీ మా మంచి అన్నయ్య… బంగ్లా ప్రధాని షేక్ హసీనా కితాబు
కరోనా, ఉక్రెయిన్ యుద్ధ సమయంలో భారత్ సాయాన్ని ఎన్నటికీ మరువలేమన్నారు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా. సోమవారం నుంచి భారత్ పర్యటనకు రానున్న తరుణంలో హసీనా ఈ వ్యాఖ్యలు చేశారు. బంగ్లా విద్యార్థులను స్వదేశానికి తిరిగి తీసుకురాడానికి ప్రధాని మోదీ సహకరించారని అభినందించారు. వ్యాక్సిన్ మైత్రి కార్యక్రమం ద్వారా పొరుగు దేశాలను కరోనా మహమ్మారి నుంచి రక్షించిన ఘనత మోదీదేనన్నారు. రెండు దేశాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కారం కావాలని.. అందుకు చర్చలు మాత్రమే శరణ్యమన్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధసమయంలో బంగ్లా పౌరులను సొంత బిడ్డల్లా.. స్వదేశానికి తరలించడానికి ఇండియా చూపించిన చొరవ అనన్యసామాన్యమన్నారు. ఇది ముమ్మాటికి ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతకు నిదర్శనమన్నారు.

పొరుగుదేశాలకు వ్యాక్సిన్లను అందించడం చిన్న విషయమేమీ కాదన్నారు. వ్యాక్సిన్లను సొంత డబ్బులు వెచ్చించి బంగ్లాదేశ్ కొనుగోలు చేసినా.. మిగతా దేశాలకు ఇండియా వ్యాక్సిన్లు అందించి పెద్ద మనసు చాటుకుందన్నారు హసీనా. బంగ్లాదేశ్‌లోని 90 శాతం ప్రజలకు వ్యాక్సినేషన్ చేయించామన్నారు. కానీ కొందరు వ్యాక్సిన్ వేయించుకోడానికి తటపటాయించారని అందువల్లే వంద శాతం వ్యాక్సినేషన్ తమకు సాధ్యం కాలేదన్నారు. 1971 నుంచి బంగ్లాదేశ్‌కు ఇండియా మిత్రదేశంగా వ్యవహరిస్తోందని… అవసరం వచ్చిన ప్రతిసారీ చేదోడుగా ఉందని ఆమె చెప్పుకొచ్చారు. 1971 యుద్ధం సమయంలో, ఆ తర్వాత 1975లో వ్యక్తిగతంగా తన కుటుంబ సభ్యులకు భారత్ అండగా నిలిచిందన్నారు హసీనా. పొరుగుదేశాలతో బంగ్లాదేశ్ ఎల్లప్పుడూ స్నేహాన్ని కోరుకుంటుందని ఇది చరిత్ర చెబుతోందన్నారు.

రెండు దేశాల సంబంధాలు ప్రజలకు మెరుగైన సేవలు అందడం కోసమేనన్నారు. కరోనా పీక్ సమయంలో బంగ్లాదేశ్ 50 ఏళ్ల స్వాతంత్ర వేడుకలను నిర్వహించుకోడానికి ఇండియా అందించిన మద్దతు ఎన్నటికీ మరువలేమన్నారు హసీనా. బంగ్లా ఏర్పాటై 50 ఏళ్ల సందర్భంగా జరిగిన ఉత్సవాల్లో ప్రధాని మోడీ, రాష్ట్రపతి హాజరై రెండు దేశాల స్నేహబంధాన్ని చాటారన్నారు. బంగ్లాదేశ్ పౌరులను తమ దేశ పౌరులుగా ట్రీట్ చేసి గొప్ప పెద్ద మనసు చాటుకున్నారన్నారు. మొత్తంగా ప్రధాని నరేంద్ర మోదీ అటు కరోనా సమయంలోనూ, ఇటు ఉక్రెయిన్ యుద్ధ సమయంలోనూ చేసిన సాయాన్ని ఎన్నటికీ మరవబోమని చెప్పుకొచ్చారు హసీనా.


