ఢిల్లీ అసెంబ్లీలో హైడ్రామా…
ఢిల్లీ అసెంబ్లీలో ఆప్, బీజేపీ అమీతుమీ
అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ రెండు పార్టీలు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ రాత్రంతా జాగారం చేస్తూ ఢిల్లీ అసెంబ్లీ ఆవరణలో ఒక ప్రత్యేకమైన సీన్ క్రియేట్ చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా 2016లో ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ చైర్మన్‌గా ఉన్నసమయంలో… రూ. 1,400 కోట్ల విలువైన నోట్ల రద్దు చేయాల్సిందిగా నాడు ఆ శాఖ ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చారంటూ ఆప్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నినాదాలు చేశారు.

మరోవైపు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్‌లను బర్తరఫ్ చేయాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేయడం రెండు పార్టీల మధ్య యుద్ధం పీక్ కు చేరింది. నోట్ల రద్దు సమయంలో ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ జనరరల్ మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని… ఆప్ ఆరోపణలు గుప్పించిన వెంటనే… బీజేపీ నేతలు లిక్కర్ పాలసీ, ఢిల్లీ పాఠశాలల నిర్మాణంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలతో హోరెత్తించారు. తాజా ఆరోపణలను కప్పిపుచ్చుకోవడం కోసమే ఎల్జీపై విమర్శలు చేస్తున్నారంటూ బీజేపీ నేతలు మండిపడ్డారు.

ఢిల్లీ అసెంబ్లీలో అవినీతి లొల్లి
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 అమలులో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణకు వీకే సక్సేనా ఇటీవల సిఫార్సు చేయడంతో రెండు పార్టీల మధ్య గత కొంతకాలంగా అగ్గిరాజుకొంది. ఢిల్లీ ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆప్ ఆరోపిస్తోంది. ఆప్ ఎమ్మెల్యేలు మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర, బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఆవరణలోని భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్‌దేవ్ విగ్రహాల దగ్గర బైఠాయించి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఆప్ ఎమ్మెల్యేలు పాటలు పాడుతూ, నినాదాలు చేస్తూ, ఎల్జీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు పట్టుకున్నారు. ఎల్జీ చేసిన అవినీతి గురించి ప్రధాని మోదీకి తెలుసునని, అయినప్పటికీ ఆయనను ఆ పదవిలో నియమించారంటూ ధ్వజమెత్తారు. KVICలో పనిచేస్తున్న క్యాషియర్లు కోట్ల విలువైన నోట్లను మార్చాలని సక్సేనా తమపై ఒత్తిడి తెచ్చారంటూ కొందరు ఉద్యోగులు ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాశారని ఆప్ ఎమ్మెల్యేలు విమర్శించారు.

లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ను టార్గెట్ చేస్తున్న ఆప్
ఎల్‌జీ సిఫారసుల ఆధారంగా, ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ 2021-22 రూపకల్పన, అమలులో జరిగిన అవకతవకలపై సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఎక్సైజ్ మంత్రిగా ఉన్న మనీశ్ సిసోడియా కార్యాలయంపై సీబీఐ దాడులు నిర్వహించడంతోపాటు, దేశ వ్యాప్తంగానూ దాడులు కొనసాగించింది. మరోవైపు ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణంపై విచారణకు సంబంధించి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నివేదికపై చర్యలు తీసుకోవడంలో రెండున్నరేళ్లకు పైగా జాప్యంపై వీకే సక్సేనా గత వారం చీఫ్ సెక్రటరీని నివేదిక కోరడంతో… ఆప్, బీజేపీ మధ్య యుద్ధం అంతకంతకూ పెరుగుతోంది. అసెంబ్లీలో తమకు మాట్లాడేందుకు అవకాశమివ్వకపోవడంతో ధర్నాకు దిగాల్సి వచ్చిందన్నారు ప్రతిపక్ష నేత, బీజేపీ ఎమ్మెల్యే రాంవీర్ సింగ్ బిధూరి. బీజేపీకి చెందిన ఆప్ విమర్శలను అసెంబ్లీలో దీటుగా ఎదుర్కొన్న బీజేపీ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు అండగా నిలిచింది.

