యువతకు ఉపాధి.. రైల్వేకు ఆదాయం
దక్షిణ మధ్య రైల్వే ఆదాయాన్ని ఆర్జించడంలో పెట్టింది పేరు. ప్రయాణికులను తరలించడంలో అయినా.. సరకు రవాణాలో అయినా ఇతర రైల్వే జోన్లకు ఆదర్శంగా నిలుస్తోంది. సంప్రదాయ ఇంధన వనరులను ఉపయోగించుకుని విద్యుత్ పాఠాలు చెబుతున్న దక్షిణ మధ్య రైల్వే ఇప్పుడు ఖాళీ స్థలాల వినియోగంపై దృష్టి పెట్టింది. 474 స్టేషన్లలో ఖాళీ స్థలాలను గుర్తించి ‘ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి’ విధానం కింద స్థానిక చేతివృత్తుల వారికి, హస్తకళలకు అవకాశాలు కల్పించాలని భావిస్తోంది. 2021-22లో ప్రయాణికుల టిక్కెట్ల రూపంలో రూ.2,690 కోట్ల వరకూ ఆదాయాన్ని సమకూర్చుకుంది. ఖాళీ స్థలాల్లో చిన్న ఎగ్జిబిషన్లు పెట్టి.. యువతకు ఉపాధి కల్పించి ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.10-15 కోట్లు రాబట్టుకోవాలనేది దక్షిణ మధ్య రైల్వే లక్ష్యం.
స్థానిక ఉత్పత్తుల అమ్మకాలు..

గతంలో మెట్టుగూడ వద్ద ఉన్న3 ఎకరాల స్థలాన్ని పార్కింగ్ కోసం లీజుకివ్వడానికి ముందుకొచ్చింది. మెట్టుగూడలోని రైల్ కళారంగ్‌ను ప్రైవేటు కార్యక్రమాలకు ఇచ్చి అద్దె వసూలు చేస్తున్న మాదిరే ఖాళీ స్థలాలను వృథాగా వదిలేయకుండా ఎగ్జిబిషన్ మైదానాలుగా మార్చాలని యోచిస్తోంది. ప్రస్తుతం ఈ బాధ్యతను రైలు ల్యాండ్ డెవలప్‌మెంట్ అథారిటీ(ఆర్‌ఎల్‌డీఏ)కి అప్పగించింది.
మౌలాలిలో 21 ఎకరాలకు పైగా స్థలం ఉంది. రైల్వే ఇక్కడ రియల్‌ఎస్టేట్ రంగాన్ని అభివృద్ధి చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేసింది. శాశ్వత కార్యక్రమాలతో పాటు అవి పట్టాలెక్కేంత వరకూ ఖాళీగా ఉన్న స్థలాలను స్థానిక ఉత్పత్తుల ప్రదర్శనకు వినియోగించుకోవాలని భావిస్తోంది. స్థానిక ఉత్పత్తుల విభాగంలో పోచంపల్లి చేనేతల వస్త్ర దుకాణాన్ని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేశారు. అలాగే ముఖ్యమైన ప్రాంతాల్లోని స్టేషన్ ముందు ఉన్న ఖాళీ స్థలంలో రకరకాల స్థానిక ఉత్పత్తుల ప్రదర్శనలు ఏర్పాటు చేసి నామమాత్రం రుసుం వసూలు చేయాలని నిర్ణయించింది. మెట్టుగూడ, చిలకలగూడ, మౌలాలి, కాచిగూడ రైల్వే నివాస ప్రాంతాల్లో ఉన్న మైదానాలలో వారం, పది రోజుల పాటు సాగే ఎగ్జిబిషన్లు పెట్టాలని ఆలోచిస్తోంది. ఇలా ఎగ్జిబిషన్ ప్రదర్శనలలో ఒక స్టాల్ తీసుకుని అమ్ముకునేందుకు స్థానిక యువతకు అవకాశం కల్పించాలని రైల్వే భావిస్తోంది.

