అమరావతి రైతుల రెండవ విడత పాదయాత్ర
అమరావతి రైతుల గుండె ఘోష మరోసారి మ్రోగనుంది. ఈ సెప్టెంబరు 12 నాటికి ఉద్యమం ప్రారంభించి వెయ్యి రోజులు పూర్తి కావస్తోంది. ఇప్పటికే న్యాయాలయం టు దేవాలయం అన్న పేరుతో అమరావతి నుండి తిరుపతి వరకూ పాదయాత్ర చేసారు. వైసీపీ ప్రభుత్వం అమరావతిలో నిర్మాణాలు ఉపసంహరించుకోవడం, మూడు రాజధానుల ఏర్పాటును తెరపైకి తేవడంతో ఏర్పడిన రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతుల గుండెలు బద్దలయ్యాయి. హైకోర్టులో మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకోవాలని కేసు వేశారు. అంతేకాక రాష్ట్ర వ్యాప్తంగా తమకు ప్రజల మద్దతు ఉందని నిరూపించుకునే ప్రయత్నంలో తొలి విడత పాదయాత్రను దాదాపు 1000 రోజులపాటు ఎండనకా, వాననకా, మహిళలు, వృద్ధులతో సహా కొనసాగించారు. వీరి ఆందోళనలు ఫలించి, హైకోర్టు అమరావతిలో రాజధాని నిర్మాణాలు పూర్తిచేయాలని, మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకోవాలని తీర్పునిచ్చింది. అయితే ప్రభుత్వం పట్టు వదలకుండా ఈ ఉత్తర్వుల అమలుకు సమయం కోరుతూ ప్రభుత్వం పిటీషన్ వేసింది. సుప్రీంకు వెళ్లాలని ఆలోచిస్తోంది. ఓ పక్క మంత్రులు కొందరు మూడు రాజధానులపై కసరత్తులు జరుగుతున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు.

ఇప్పుడు రైతులు రెండోవిడత పాదయాత్రను 60 రోజుల పాటు గుంటూరు, కృష్ణా, ఏలూరు, రాజమండ్రి, తుని, విశాఖ, విజయనగరం , విశాఖల మీదుగా శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి ఆలయం వరకూ యాత్రను జరపాలని నిర్ణయించుకున్నారు. దీనిని విజయవంతం చేయవలసిందిగా వైసీపీ మినహా
అన్ని పార్టీల మద్దతును కూడగట్టుకుంటున్నారు. అమరావతి పరిరక్షణ కమిటీ, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి నాయకులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఈ పాదయాత్రకు అనుమతి కోసం ఐకాస నేతలు ఇప్పటికే డీజీపీ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. యాత్ర సమయంలో ఇబ్బందులు కలుగకుండా అంబులెన్స్, బయోటాయ్‌లెట్ల వాహనాలను కూడా సిద్దం చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీరి యాత్ర సఫలం కావాలని ఆశిద్దాం.

