Andhra PradeshNewsNews Alert

ఇక సహించేది లేదు.. దేనికైనా రెడీ …

ప్రకాశం జిల్లా వైసీపీలో లుకలుకలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. వైసీపీలో గ్రూప్ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఈమధ్య సీఎం జగన్ చీమకుర్తి పర్యటనలో జరిగిన బహిరంగ సభకు ప్రక్క నియోజకవర్గం దర్శికి చెందిన సొంత పార్టీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ హాజరు కాకపోవడం పార్టీలో తీవ్ర అసంతృప్తి ఉందన్న విషయాన్ని బహిర్గతం చేసింది. పక్క నియోజకవర్గానికి స్వయంగా సీఎం వచ్చినా కూడా వేణుగోపాల్ పట్టిపట్టనట్టు వ్యవహరించడాన్ని పార్టీ నేతలు తప్పు బడుతున్నారు. వేణుగోపాల్ తీరుపై సీఎం కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈసారి పార్టీ టికెట్ ఆయనకు కష్టమేనని కూడా తెలుస్తోంది. ఇప్పటికే సీఎం తెప్పించుకున్న నివేదికలలో దర్శిలో కూడా వేణుగోపాల్ పని తీరుపై చాలా అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది.

రెండు రోజుల క్రితం దర్శిలో వ్యవసాయ మార్కెట్ కమిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో కూడా వేణుగోపాల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ మాట్లాడడం పార్టీ కేడర్ ను ఆశ్చర్యంలో పడేసింది. ఇన్నాళ్లూ చాలా భరిస్తూ వచ్చానని, పార్టీ కోసం, ప్రజలకోసం, ఎంతో చేశానని అన్నారు. అయినా మూడేళ్ళుగా నిద్ర లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో అవమానాలను భరించా.. సొంత పార్టీలో చేదు అనుభవాలను చవి చూశా.. కానీ ఇప్పుడు ఓర్పు నశించింది. ఇంకా ఎన్నాళ్ళని భరించ గలను అంటూ ప్రశ్నించారు. ఇక దేనికైనా సిద్ధం అన్నారు. దర్శిలో ప్రజల కోసం సొంత ఇల్లు ఏర్పాటు చేసుకున్నా రాజకీయం చేస్తున్నారని, నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారని, కార్యకర్తలతో ప్రొటోకాల్ పాటించకుండా మీటింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు.

సీఎం జగన్‌కు నమ్మకం ఉన్నంత వరకూ వైకాపాలో ఉంటానని, తాను పదవులకు ఆశ పడే వాడ్ని కాదని వాపోయారు. తనను కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఒక సామాజిక వర్గానికి ముడి పెట్టి మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన నియోజక వర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో సహా రెడ్డి సామాజిక వర్గం కూడా ఎక్కువ శాతం తనవెంటే ఉన్నారని అన్నారు. తాను అందరి వ్యక్తినని చెప్పారు వేణుగోపాల్.