పులస రుచి అదరహో..ధర బెదరహో..
“పుస్తెలు అమ్మి అయినా సరే జీవితంలో ఒక్కసారయిన పులస కూర తినాలి” అని పెద్దలు ఊరికే అనలేదు. దీనికి తగ్గట్టుగానే ప్రస్తుతం మార్కెట్‌లో పులస ధర బంగారంతో పోటీపడుతుంది. ఈ రోజుల్లో ఎవరైనా పులస తినాలంటే బంగారం తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మేరకు అత్యంత అరుదుగా దొరికే పులస ధర పులస ప్రియులను బెంబేలెత్తిస్తుంది. ఇటీవల కాలంలో గోదావరిలో వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది.

దీంతో యానాం మార్కెట్‌లో పులస విక్రయాలు ప్రారంభమయ్యాయి. తాజాగా ఇక్కడి రేవులో చేపల వేలం పాట నిర్వహించారు. ఈ వేలం పాటలో 2 కిలోల బరువున్న పులస చేపను పార్వతి అనే మహిళ దక్కించుకున్నారు. దానిని ఆమె భైరవపాలెంకు చెందిన ఒక వ్యక్తికి రూ.19 వేలకు విక్రయించారు. అయితే ఈ సీజన్‌లో ఇదే అధిక ధరని స్థానికులు చెబుతున్నారు. మత్స్యకారులు మాత్రం ప్రస్తుతం ఐ.పోలవరం మండలం భైరవపాలెం మొగ వద్ద ఇసుక మేటలు ఉన్నాయన్నారు. దీని కారణంగానే ఈసారి పులస చేపలు తక్కువగా వస్తున్నాయని తెలిపారు.