ప్రకంపనలు రేపుతున్న మద్యం కుంభకోణం..
మద్యం దుకాణం ఒక్కటుంటే చాలు మస్తు సంపాదించుకోవచ్చు. అదే మద్యం వ్యవస్ధే మనదైతే .. ఇక ఆ సంపాదనకు అంతూపొంతూ ఉండదు. అందుకే రాజకీయమంతా ఇప్పుడు మద్యం చుట్టూనే తిరుగుతోంది. మద్యం వ్యాపారంపైనే ఆసక్తి చూపుతోంది. మద్యం కుంభకోణాలకూ పాల్పడేట్టు చేస్తోంది. పైసలకు పైసలు .. పదవికి పదవి. ఒకదాని కొకటి ఎంతో అన్యోన్యత. పైసలుంటేనే పదవి. పదవుంటేనే పైసలు. అందుకే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక కుంభకోణాలు వెలుగు చూస్తున్నాయి. అదీనూ ఢిల్లీని వేదికగా చేసుకుని రాకెట్ నడిపే నేతలు ఎక్కువ మందయ్యారు. అవినీతిలో ఈ రెండు రాష్ట్రాలు పోటీలు మీద పోటీలు పడుతున్నాయి. నెంబర్ వన్ స్ధానాన్ని కైవసం చేసుకోవాలని ఆరాట పడుతున్నాయి. ఇదే విషయాన్ని బీజేపీ నాయకులు ప్రకటించి ఓ సంచలనానికి తెరతీశారు.

హద్దులు దాటయి.. సరిహద్దులు దాటాయి. ఢిల్లీకి చేరాయి. అక్కడ మద్యం విధానాల రూపకల్పన వెనుక తెలుగు నేతల పాత్రే ఎక్కువగా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబీకుల పాత్రే ఉందని కమలనాధుల ఆరోపణ. ఈ వ్యవహారంలో కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారాయని కమలనాధులు అంటున్నారు. ఈ డీల్ లో కేసీఆర్ కుమార్తె కవిత ప్రధాన భాగస్వామిగా ఉన్నారని బీజేపీ నేతలు అంటున్నారు. ఢిల్లీ, ఛండీగఢ్ లోని ఫైవ్ స్టార్ హోటళ్ళలో అనేక సమావేశాలు జరిపి మద్యం కుంభకోణానికి సంబంధించిన డీల్ కుదుర్చుకున్నారని బీజేపీ ఆరోపణ. ఇందులో అరుణ్ రామచంద్రపిళ్ళైతో పాటు కవిత, మనీష్ సిసోడియాలు పాల్గోని పెద్ద ఎత్తున ముడుపులు స్వీకరించినట్లు కమలనాధులు ఆరోపిస్తున్నారు. ఇందులో ఇంకా అనేక మంది పాత్ర ఉందని .. ఢిల్లీలో మద్యం వ్యాపారాలకు సంబంధించిన పలు చిన్న కంపెనీలకు ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ చెల్లింపులు కూడా జరిగినట్లు తెలుస్తోంది.

మద్యం కుంభకోణానికి సంబంధించి దేశవ్యాప్తంగా దాదాపు 31 స్ధావరాలపై సీబీఐ దాడులు నిర్వహించింది. 16 మందిై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసింది. అయితే వీరిలో ఎనిమిది మంది దేశం విడిచి పారిపోకుండా.. అన్ని విమానాశ్రయాలు, పోర్టుల్లో అధికారులను అప్రమత్తం చేస్తూ లుకౌట్ సర్కిలర్లు కూడా జారీ చేశారు. కొంతమంది ప్రభుత్వ హోదాల్లో ఉన్నందున వారిపై లుకౌట్ నోటీసులు ఇవ్వలేదు. ఈ కేసులో సీబీఐ కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తోంది. కేసు తీవ్రత దృష్ట్యా.. అనేక అంశాలను సీబీఐ గోప్యంగా ఉంచుతోంది. ఇక అవినీతిలో రెండు తెలుగు రాష్ట్రాలు పోటీలు పడుతున్నాయని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. అవినీతిలో దేశంలోనే తెలంగాణ రెండవ స్ధానంలో ఉంటే.. ఏపీ నాలుగవ స్ధానంలో కొనసాగుతోందని ధ్వజమెత్తారు. మాఫియా వ్యవస్ధకు ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కొమ్ము కాస్తున్నాయని.. అందులో భాగమే మద్యం కుంభకోణం అంటూ అనురాగ్ ఠాకూర్ విమర్శించారు.

తనపై బీజేపీ నాయకులు చేసి ఆరోపణలకు కల్వకుంట్ల కవిత స్పందించారు. తనకు మద్యం కుంభకోణంతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు చేయడాన్ని ఆమె తీవ్రంగా పరిగణిస్తూ న్యాయస్ధానంలో పరువునష్టం కేసు వేయబోతున్నారు. ఢిల్లీకి చెందిన బీజేపీ నాయకులు మంజీందర్ సింగ్ సిర్సా, పర్వేష్ వర్మలపై కేసు వేయనున్నట్లు కవిత తెలిపారు. ఇదంతా ఓ పథకం ప్రకారం జరుగుతున్న కుట్రగా ఆమె పేర్కొన్నారు. విపక్షాలపై బీజేపీ విషం కక్కుతోందని.. కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని కవిత ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదని హితవు పలికారు. తనపై ఢిల్లీ బీజేపీ నాయకులు చేసినవన్నీ నిరాధారమైన ఆరోపణలుగా ఆమె కొట్టి పారేశారు. మొత్తానికి ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మరోవైపు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా తీవ్రంగా స్పందించారు. తాను ఆప్ ను వీడి బీజేపీలో చేరితో తనపై ఉన్న అన్ని కేసులు ఉపసంహరించుకుంటామని బీజేపీ నుండి ఓ సందేశం వచ్చినట్టుగా చెబుతున్నాడు. తమ దారికి రాకపోతే తీవ్ర కేసుల్లో ఇరికించి వేధిస్తారు అనడానికి ఇదే నిదర్శనమని సిసోడియా పేర్కోన్నారు. ఇక ఈ కుంభకోణంలో ఎవరి పాత్ర ఏంటి అనే నిజాలను వెలికి తీసే పనిలో సీబీఐ బిజీగా ఉంటే.. ఈ వ్యవహారాన్ని అటు టీఆర్ఎస్.. ఇటు ఆప్ సీరియస్ గా తీసుకున్నాయి.


