కలిసుంటేనే నిలబడతాం…
పదవిని.. పసిడిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆద మరిచినా.. అప్రమత్తంగా లేకపోయినా చేజారి పోయినట్టే. భద్రంగా చూసుకోండి, మళ్ళీ వచ్చి తీసుకుంటా అంటే .. ఇంక అంతే సంగతులు. శశికళ విషయంలో కూడా అదే జరిగింది. జైలు నుండి రాగానే సీఎం పీఠమెక్కాలనుకుంది. కానీ.. చిత్రాన్ని పూర్తిగా మార్చేశారు నమ్మినబంట్లు. ఆమె బయటకొచ్చే సమయానికే ఆమెను పార్టీ నుండి వెళ్ళగొట్టారు. అన్ని పదవులు ఊడగొట్టారు. ఇద్దరూ కలిసి అధికారాన్ని పంచుకున్నారు. ఇటు చిన్నమ్మ అల్లుడూ.. అటు పెద్దమ్మ కోడలు కలిసి ఎక్కడ పార్టీని సొంతం చేసుకుంటారా అని భయపడ్డారు. కానీ.. వారిని కూడా తమ తెలివికి పదును పెట్టి దూరం జరిపారు. శభాష్ అనుకుంటూ ఒకరికొకరు భుజాలు చరుచుకున్నారు. కాలం గడిచింది. పదవులు ఊడాయి. స్టాలిన్ రూపంలో అపజయం ఎగిరి తన్నింది. ఇక రాజకీయం చేయడానికేం ఉంది. వారి ఇద్దరి మధ్యలోనే పొగలు బయలుదేరాయి. సెగలు కక్కాయి. చివరికి పై చేయి సాధించి పార్టీ పగ్గాలు తన చేతుల్లో పెట్టుకున్నాడు పళనిస్వామి. చేసేది లేక కోర్టు మెట్లెక్కాడు పన్నీర్ సెల్వం. ఇదీ అన్నాడీఎంకేలో జరుగుతున్న తంతు.

సమన్వయం లేదు. సర్దుకుపోయే తత్వం అంతకన్నా లేదు. ఇద్దరూ అధి నాయకులే. చిన్నమ్మకు నమ్మకస్తులే, నమ్మినబంట్లే. కానీ.. ఏం జరిగింది. ఆమెనే పార్టీ నుండి తరిమేశారు. ఇప్పుడు ఆధిపత్యం కోసం తన్నులాడుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ చిన్నమ్మ గుర్తుకు వస్తోంది. ఆమెతో అనుబంధం.. గతంలో పార్టీలో ఆమె స్ధానం జ్డాపకమొస్తోంది. పార్టీ వ్యవస్ధ అంతా తన చేతుల్లోనే ఉందని పళని స్వామి భావిస్తుంటే.. పన్నీర్ సెల్వం మాత్రం తన ఉనికిని కాపాడుకునేందుకు న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. అసలే కష్టకాలం. పార్టీ చాలా బహీన స్ధితిలో పడింది. స్టాలిన్ నేతృత్వంలో డీఎంకే బలీయమైన స్ధితిలో ఉంది. అనూహ్య విజయంతో అధికారాన్నీ దక్కించుకుంది. కొత్త పోకడలతో ముందుకు వెళుతూ .. శభాష్ అనిపించుకుంటోంది. గతంలో జయలలిత ప్రవేశ పెట్టిన పథకాల పేర్లను కూడా మార్చకుండా అవే పేర్లతో.. అవే పథకాలను కొనసాగించడం స్టాలిన్ ప్రత్యేకత. అందుకే ఆయన ప్రభుత్వానికి మంచి మార్కులు పడుతున్నాయి. ఇక అన్నాడీఎంకేలో పళని, పన్నీర్ బ్యాచ్ తన్నులాటలకు దిగుతున్నారు. పరస్పర దాడులకు పాల్పడుతున్నారు.

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎవరినీ ఒకే స్ధితిలో ఉంచదు. ఆలోచనలో మార్పులకూ దోహదం చేస్తుంది. అలాంటి పరిస్ధితి ఇప్పుడు ఏర్పడింది. గడిచిన లోపాలను సరిదిద్దుకుని .. కొన్ని సంవత్సరాల పాటు దూరం పెట్టిన చిన్నమ్మను మళ్ళీ కలుపుకుని అంతా కలిసి పని చేయాలని పన్నీర్ సెల్వం పిలుపునిచ్చారు. పార్టీ బలపడాలంటే.. తిరిగి అధికారం చేపట్టాలంటే వర్గ విభేదాలు, ముఠాల కుమ్ములాటలు మరిచి ఐక్యతతో పని చేయాలని పార్టీ నేతలందరికీ విజ్ఞప్తి చేశారు. అంతేకాదు .. ఆప్యాయతలు, అనురాగాలు, ప్రేమాభిమానాలు కూడా తన్నుకు వచ్చాయి. ఎంజీఆర్ తమ్ముళ్ళలా.. పురచ్చి తలైవీకి తనయులులా సమైక్య నాదాన్ని పూరించాలని గంభీరంగా పలికారు. అలాగే దినకరన్, దీప లను కూడా కలిసి పని చేయడానికి ఆహ్వానించారు. పట్టుదలలు వీడి.. అహంకారాన్ని వదిలి.. అంతా కలిస్తేనే తిరిగి అధికారంలోకి వస్తామని హితవు పలికారు. పార్టీలో జంట నాయకత్వం కంటే సమైక్య నాయకత్వాన్ని కోరుకుంటున్నట్లు పన్నీర్ సెల్వం చెప్పారు. పళని స్వామి తన సోదరుడంటూ కొత్త బంధాన్ని కలిపారు.

పురచ్చి తలైవీ జయలలితకు పన్నీర్ సెల్వం అత్యంత వీర విధేయుడు. గట్టి నమ్మకస్తుడు. ఆ నమ్మకమే.. ఆ విశ్వాసమే .. ఆ వీర విధేయతే అతడిని మూడుసార్లు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టేలా చేసింది. అయినా తనకంటూ వర్గాన్ని నిర్మించుకోలేదు. అధినేత ఎలా చెబితే అలా నడుచుకున్నాడు. కానీ.. జయ తరవాత పార్టీ పగ్గాలన్నీ శశికళ చేతుల్లోకి వెళ్ళాయి. పన్నీర్ సెల్వంకు గడ్డు రోజులు ఏర్పడ్డాయి. పళని స్వామి దశ తిరిగి సీఎం అయ్యాడు. కానీ నమ్మకం ప్రకటించలేదు. విశ్వాసాన్ని చూపించలేదు. విధేయత కనబరచలేదు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ అలా జైలు కెళ్ళిందో లేదో .. అప్పుడే తన విశ్వరూపాన్ని చూపించాడు ఎవరైతే నమ్మి పదవి అప్పగించారో వారినే పార్టీ నుండి తొలగించారు. ఆమె వర్గీయులను పార్టీ నుండి గెంటేశారు. మొత్తం వ్యవస్ధనే తన చెప్పు చేతల్లోకి తెచ్చుకున్నారు. కానీ.. పార్టీలో సీనియర్, అపార అనుభవం ఉన్న పన్నీర్ సెల్వం లాంటి నేతల పట్ల చాలా దారుణంగా వ్వహరిస్తూ వచ్చారని అంటారు. ఆయనను .. ఆయనతో పాటు ఆయన వర్గీయులను కొద్దికాలం నుండి యటకు పెంపే ప్రయత్నా కూడా చేశారు. ఈ క్రమంలోనే ఆయన న్యాయస్ధానం గడప తొక్కారు. కానీ.. పన్నీరేమో అందరూ కలిసి పని చేయాలని అంటారు. పళని మాత్రం తన నాయకత్వాన్ని అందరూ అంగీకరించాలంటాడు. ఇపపుడు పన్నీర్ సెల్వం ఐక్యతారాగాన్ని వినిపించడం పట్ల పళని స్వామి ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం. రానున్న రోజుల్లో అన్నా డీఎంకేలో ఏం జరిగినా ఆశ్చర్య పోనవసరం లేదు.


