NewsTelangana

31 నుంచి గణపతి ఉత్సవాలు

దేశ వ్యాప్తంగా ఈ నెల 31వ తేది నుంచి గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ప్రతి ఏటా గణపతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించే తెలంగాణ ప్రభుత్వం ఈసారి కూడా ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. హైదరాబాద్‌లో గణపతి ఉత్సవాలు ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీలో గణేష్ ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ ఏడాది జీహెచ్ఎంసీ ఆధ్యర్యంలో 4లక్షలు, పీసీబీ ఆధ్వర్యంలో లక్ష, హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో లక్ష చొప్పున మొత్తం 6 లక్షల విగ్రహాలను పంపిణీ చేస్తామన్నారు.దీనికోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఎంతగానో ప్రసిద్ది చెందిన ఖైరతాబాద్ గణేష్‌ను దర్శించడానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గణపతి ఉత్సవాలు ప్రారంభానికి ముందే ఈ నెల 24వ తేదీన అధికారులతో కలిసి ఖైరతాబాద్ గణేష్ మండపాన్ని సందర్శిస్తామని పేర్కొన్నారు. విగ్రహాల నిమజ్జనం కోసం నగరంలో ఇప్పటికే ఉన్న 25 పాండ్‌లకు అదనంగా మరో 50 పాండ్‌లను నిర్మిస్తామన్నారు. ఈ విగ్రహాల నిమజ్జనం రోజున ఊరేగింపు కోసం రహదారుల్లో అవసరమైన చోట్ల మరమ్మత్తులు, అభివృద్ది పనులు చేపడతామన్నారు.సెప్టెంబర్ 9న జరిగే గణేష్ నిమజ్జనానికి సుమారు 8వేల మంది జీహెచ్‌ఎంసీ సిబ్బంది మూడు షిప్టుల్లో విధులు నిర్వహిస్తారన్నారు. ఈ గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించడానికి ప్రజలందరూ సహకరించాలని మంత్రి కోరారు.