మర్కుక్‌లో నాసిరకం రేషన్ బియ్యం
ములుగు జిల్లా (ఏడీఎన్ఎన్): మర్కుక్ మండల కేంద్రంలోని చౌకధర దుకాణాల్లో జులై నెలకు పంపిణీ చేస్తున్న సన్నబియ్యం నాసిరకంగా ఉందంటూ లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బియ్యంలో పురుగులు, ముక్క బియ్యం, ఎలుకల మలం, చెత్తాచెదారం ఉండటంతో వండుకోవడానికి కూడా పనికిరావడం లేదని ఆరోపిస్తున్నారు. వర్షాకాలంలో ఇలాంటి బియ్యం వినియోగిస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని రెండు రేషన్ దుకాణాల పరిధిలో 1,120 రేషన్ కార్డులు ఉండగా, ప్రతి నెల సుమారు 240 క్వింటాళ్ల సన్నబియ్యం పంపిణీ అవుతోంది. అయితే ఈసారి సరఫరా చేసిన బియ్యం నాణ్యత లేకపోవడంతో చాలామంది లబ్ధిదారులు తీసుకెళ్లేందుకు నిరాకరిస్తున్నారు. ప్రభుత్వం నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్నామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పాత నిల్వలను పంపిణీ చేస్తున్నారని విమర్శిస్తున్నారు. బియ్యం సంచులపై 2022 – 23 సంవత్సరానికి సంబంధించిన స్టిక్కర్లు ఉండటంతో పాత నిల్వలేనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
రేషన్ డీలర్ పద్మ మాట్లాడుతూ, గోడౌన్ నుంచి వచ్చిన బియ్యంలోనే పురుగులు, చెత్తాచెదారం ఉండటంతో లబ్ధిదారులు తమపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. నాసిరకం బియ్యాన్ని వెంటనే వెనక్కి తీసుకుని, నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలని ప్రభుత్వం, పౌరసరఫరాల శాఖ అధికారులను స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
