తెలంగాణలో ఆగని రైతుల ఆత్మహత్యలు
తెలంగాణా రాష్ట్రంలో మరో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.ఖమ్మం జిల్లాలో సాగు నీరు లేక ఒకరు, జనగామ జిల్లాలో అప్పుల బాధతో మరొకరు ఇలా ఒకే రోజు ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం రేకెత్తించింది.ఖమ్మం జిల్లా చింతకాని మండలం లచ్చగూడెం గ్రామానికి చెందిన నెరుసల ఎల్లయ్య (45) ట్రాక్టర్ డ్రైవర్‌గా జీవనం కొనసాగిస్తూ మూడు ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. భూమి పక్కనే ఉన్న వాగులో నీరు లేక భూమి నెర్రెలుబారింది. పంటను కాపాడుకోలేక పెట్టుబడి రూ.2 లక్షలు ఎలా కట్టాలో తెలియక, తీవ్ర మనస్థాపానికి గురై పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.జనగామ జిల్లా తరిపుగొప్పుల మండలం సోలిపురం గ్రామానికి చెందిన పాండ్యాల బుచ్చయ్య (51) రూ.14 లక్షల వరకు అప్పు చేసి పెట్టుబడి పెట్టాడు. పంట దిగుబడి లేక అప్పులు ఎలా కట్టాలో తెలియక ఆవేదనతో పొలంలోనే గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు .