Breaking Newshome page sliderHome Page SliderTelangana

ములుగు ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రుల సమీక్ష

ములుగు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేసి, రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇటీవల మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం బుధవారం నిర్వహించారు . జిల్లాలోని ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిగతులు, నిధుల వినియో, పనుల్లో ఎదురవుతున్న సాంకేతిక, పరిపాలనాపరమైన అడ్డంకులపై మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. రైతాంగ ప్రయోజనాల దృష్ట్యా పనుల్లో జాప్యాన్ని అస్సలు సహించబోమని, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని అధికారులను ఆదేశించారు.

ముఖ్యంగా జిల్లాలోని జీవనాడి వంటి దేవాదుల ఎత్తిపోతల పథకం సహా గోదావరి నదిపై నిర్మిస్తున్న ఇతర సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా జిల్లాలోని మెజారిటీ సాగు భూమికి నీరు అందుతుందని, దీనివల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని మంత్రులు ఆశాభావం వ్యక్తం చేశారు. గత నెలలో ముఖ్యమంత్రి సైతం ఈ ప్రాజెక్టుల విషయంలో స్పష్టమైన దిశానిర్దేశం చేస్తూ, నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నీటి విడుదలపై రైతులకు భరోసా కల్పించేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రాబోయే రెండేళ్ల కాలపరిమితిని డెడ్ లైన్‌గా పెట్టుకుని, ఈ ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలనే చిత్తశుద్ధితో ప్రభుత్వం ఉంది. ఇందుకు అవసరమైన నిధులను సత్వరం విడుదల చేస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీతో పనులకు నిధుల కొరత తీరనుంది. అధికారుల సమన్వయం, నిధుల లభ్యత మరియు ప్రభుత్వ పర్యవేక్షణ తోడైతే, ములుగు జిల్లాలో సాగునీటి రంగం కొత్త పుంతలు తొక్కుతుంది. ఈ చర్యల వల్ల జిల్లాలోని వేలాది మంది రైతులకు శాశ్వత సాగునీటి వసతి లభించి, ములుగు జిల్లా సస్యశ్యామలం కానుంది.