పవన్ కళ్యాణ్ తెలంగాణ వ్యతిరేకి
తెలంగాణలో పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారన్న వార్తలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్‌ను ‘దిష్టి కల్యాణ్’ అని అభివర్ణిస్తూ, ఆయన రాజకీయాలు ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కావాలని సూచించారు. గతంలో తెలంగాణ గురించి నీచంగా మాట్లాడిన పవన్ ఒక తెలంగాణ వ్యతిరేకి అని, ఆయన మాటలు నమ్మి ఇక్కడ ఎవరూ ఓట్లు వేయరని స్పష్టం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ‘గుండు సున్నా’ రాబోతోందని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మతం పేరుతో రెచ్చగొట్టిన ఆ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కలేదని ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు.
తెలంగాణలో బీజేపీ మతం కార్డుతో మళ్లీ లబ్ధి పొందాలని చూస్తోందని మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. భైంసా అల్లర్ల ద్వారా గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందిన ఆ పార్టీ, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే ఫార్ములాను అమలు చేయాలని చూస్తోందని విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమం పేరుతో కాంగ్రెస్ ఓట్లు అడుగుతుంటే, బీజేపీ మాత్రం విభజన రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఎనిమిది మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి కూడా బడ్జెట్లో తెలంగాణకు ఏం తెచ్చారో సమాధానం చెప్పాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడిని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల అనుసరిస్తున్న వివక్షను ఆయన గణాంకాలతో సహా ఎండగట్టారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5.01 శాతంగా ఉన్నా, రావాల్సిన నిధుల్లో సగం కూడా ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. గత ఐదేళ్లలో తెలంగాణ ప్రజలు కట్టిన పన్నులను గుజరాత్ వంటి ఉత్తరాది రాష్ట్రాలకు తరలిస్తున్నారని, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర బడ్జెట్ ఉందని ఆరోపించారు. బయ్యారం స్టీల్ ప్లాంట్, ఐఐఎం, మెట్రో వంటి కీలక ప్రాజెక్టులను విస్మరిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అడ్డుపడుతోందని మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు.

