‘సింగ్’ లుక్‌లో జనసేనాని..!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఆదివారం పర్యటించి ఆధ్యాత్మిక సందడి చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో కలిసి ఆయన ప్రసిద్ధ ‘తఖ్త్ సచ్ కండ్ శ్రీ హజూర్ సాహిబ్’ గురుద్వారాను సందర్శించారు. సిక్కుల ఐదు అత్యున్నత పీఠాల్లో ఒకటిగా వెలుగొందుతున్న ఈ క్షేత్రంలో సిక్కుల 10వ మత గురువు గురు గోవింద్ సింగ్ జీ సమాధి మందిరాన్ని వారు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సంప్రదాయ సిక్కు తలపాగా (దస్తార్) ధరించి ‘సింగ్’ లుక్‌లో కనిపించడం అందరినీ ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.
సిక్కుల 9వ గురువు గురు తేగ్ బహదూర్ సింగ్ జీ 350వ షాహిదీ సమాగమం (ఆత్మార్పణ దినోత్సవం)లో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ నాందేడ్ విచ్చేశారు. మధ్యాహ్న సమయంలో గురుద్వారాకు చేరుకున్న ఆయనకు చైర్మన్ డాక్టర్ విజయ్ సత్పాల్ సింగ్ ఆధ్వర్యంలో మత పెద్దలు సాదరంగా స్వాగతం పలికారు. ప్రధాన మందిరంలో పవన్ కళ్యాణ్ , దేవేంద్ర ఫడ్నవిస్ కలిసి గురు గోవింద్ సింగ్ సాయిబాకు పవిత్రమైన చాదర్‌ను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గురుద్వారా గ్రంథీలు పవిత్ర వస్త్రాన్ని కప్పి వారిని ఆశీర్వదించారు. దర్శనం తర్వాత గురుద్వారా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ డొనేషన్ మెషీన్‌ను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు.
మొదటిసారి ఈ పవిత్ర క్షేత్రాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్‌ను సిక్కు మత పెద్దలు అత్యంత ఘనంగా సత్కరించారు. గురుద్వారా జ్ఞాపికతో పాటు సిక్కులు ధైర్యానికి చిహ్నంగా ధరించే పవిత్ర ఆయుధం ‘కిర్పాన్’ను ఆయనకు బహూకరించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ, గురు తేగ్ బహదూర్ సింగ్ జీ చేసిన త్యాగం దేశం మొత్తానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ధర్మ పరిరక్షణ కోసం ఆయన చేసిన బలిదానం భవిష్యత్ తరాలకు వెలుగునిస్తుందని, అలాంటి మహనీయుడి 350వ షాహిదీ సమాగమంలో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సాయంత్రం మోదీ మైదాన్‌లో జరిగిన ప్రధాన దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఆయన తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరారు

