ఇరాన్ పై వెనక్కి తగ్గిన ట్రంప్
ఇరాన్‌పై ఇప్పుడప్పుడే దాడి చేయబోమని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఇరాన్‌లో కొనసాగుతున్న ఆందోళనలకు మద్దతుగా సైనిక చర్యలకు సిద్ధమైన అమెరికా , చివరి నిమిషంలో తన ప్రణాళికలను విరమించుకున్నట్లు తెలుస్తోంది. టెహ్రాన్‌పై దాడులపై వెనక్కు తగ్గినట్లు ట్రంప్ హామీ ఇచ్చారని పాకిస్థాన్‌లోని ఇరాన్ రాయబారి మీడియాకు వెల్లడించారు. దీంతో గత కొన్ని రోజులుగా ఉద్రిక్తంగా మారిన అమెరికా–ఇరాన్ సంబంధాల్లో కొంత శాంతి వాతావరణం నెలకొంది. ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ ఆందోళనకారులకు మరణశిక్షలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు వైట్ హౌస్ తెలిపింది.
అమెరికా దాడులు రద్దు కావడంతో ఇరాన్ తన గగనతలాన్ని మళ్లీ తెరిచింది. ఈ పరిణామాలతో ఖతార్‌లోని అల్–ఉదెయిద్ వైమానిక స్థావరం సహా పశ్చిమాసియాలోని పలు అమెరికా సైనిక స్థావరాల నుంచి ముందుగా ఖాళీ చేసిన సిబ్బంది తిరిగి తమ విధుల్లో చేరారని ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది. అల్–ఉదెయిద్ స్థావరంలో భద్రతా హెచ్చరికల స్థాయిని కూడా తగ్గించినట్లు తెలిపింది.
అంతకుముందు ఇరాన్ తన ఎయిర్‌స్పేస్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రత్యేక అనుమతులు ఉన్న విమానాలు తప్ప ఇతర విమానాలకు అనుమతి లేదని స్పష్టం చేస్తూ ఎయిర్‌మెన్‌కు నోటీసు జారీ చేసింది. ఈ నిర్ణయానికి ముందే ఇరాన్, ఇరాక్ గగనతలాలు పూర్తిగా ఖాళీ అయినట్లు విమాన ట్రాకింగ్ వెబ్‌సైట్లు చూపించాయి.
ఇదిలాఉండగా, ఇరాన్ మాత్రం పూర్తిగా వెనక్కు తగ్గినట్లు కనిపించడం లేదు. అమెరికా దాడి చేస్తుందన్న అనుమానంతో యుద్ధానికి సిద్ధమవుతోంది. ఇరాక్ సైన్యాన్ని కూడా తమ వ్యూహంలో భాగం చేసుకున్నట్లు సమాచారం. ట్రంప్‌పై గతంలో జరిగిన హత్యాయత్నం ఫొటోను ప్రసారం చేస్తూ , ఈసారి బుల్లెట్ గురి తప్పదని ఇరాన్ ప్రభుత్వ టీవీ బెదిరింపుల సందేశాన్ని ప్రసారం చేయడం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేగింది. పశ్చిమాసియాలో పరిస్థితులు ఇంకా పూర్తిగా చల్లారలేదన్న సంకేతాలను ఇవి స్పష్టం చేస్తున్నాయి .

