Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page slider

జిల్లా అభివృద్ధికి వైఎస్సార్ ముద్ర

ఈ ప్రాంతానికి కృష్ణా జలాలు వస్తున్నాయంటే అది దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుణ్యమేనని వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గుర్తు చేశారు.”రూ.480 కోట్లతో వాటర్ గ్రిడ్ పథకాన్ని ప్రారంభించి, పేదలకు తాగునీరు అందించాలని సంకల్పించింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. పాపాఘ్ని నది నుంచి ఇసుక అక్రమ రవాణా విచ్చలవిడిగా జరుగుతోంది. దొంగతనాలు, మట్కా, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా జిల్లాను మారుస్తున్నారు,” అని ఆగ్రహం వ్యక్తం చేశారు
చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై అవినాష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికారం చేపట్టి 18 నెలలు గడుస్తున్నా, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. సోమవారం జిల్లాలో పర్యటించిన ఆయన, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.

చంద్రబాబు ప్రభుత్వం రాగానే పేదల పొట్ట కొడుతూ 5 లక్షల మంది పెన్షన్లను అన్యాయంగా తొలగించారని అవినాష్ రెడ్డి ఆరోపించారు.”ఎన్నికల ముందు ప్రతి మహిళకు రూ.18 వేలు, నిరుద్యోగులకు రూ.3 వేల భృతి, రైతులకు ఏటా రూ.20 వేల భరోసా ఇస్తామని చెప్పి ఇప్పుడు మొహం చాటేస్తున్నారు. రైతు భరోసా, నిరుద్యోగ భృతి హామీలు ఏమయ్యాయి?” అని ఆయన నిలదీశారు.గతంలో 66 లక్షల మందికి పెన్షన్లు అందేవని, ఇప్పుడు ఆ సంఖ్యను తగ్గించడం దారుణమని ధ్వజమెత్తారు.

ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే వైసీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడమే చంద్రబాబు సర్కార్ ఘనతగా మారిందని అవినాష్ రెడ్డి విమర్శించారు. 8 వేల ఇళ్లను పూర్తి చేసి పేదలకు అందజేయాలన్నదే తమ లక్ష్యమని, ఇప్పటికైనా బోగస్ మాటలు కట్టిపెట్టి జిల్లా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. జగన్ ప్రభుత్వం చేసిన మంచి పనులు ప్రజల గుండెల్లో ఉన్నాయని, వాటిని ఎవరూ చెరపలేరని ఆయన స్పష్టం చేశారు.