Breaking NewsHome Page Sliderhome page sliderNational

ఉన్నావ్ అత్యాచార బాధితురాలికి ఊరట

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు సోమవారం జారీ చేసింది. ఈ కేసులో ప్రధాన దోషి, మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ జీవిత ఖైదును సస్పెండ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని వెకేషన్ బెంచ్ , హైకోర్టు ఉత్తర్వులను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. సెంగార్‌కు విధించిన శిక్షకు సంబంధించిన కీలక అంశాలను హైకోర్టు సరైన రీతిలో పరిశీలించలేదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ప్రాథమికంగా అభిప్రాయపడింది.
2017లో మైనర్ బాలికపై జరిగిన ఈ ఘోర అత్యాచారానికి సంబంధించి సెంగార్‌ను దోషిగా నిర్ధారించిన కోర్టు, ఆయనకు జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఆయన శిక్షను సస్పెండ్ చేస్తూ బెయిల్ మంజూరు చేయడంతో బాధితురాలి తరపు న్యాయవాదులు, సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పరిణామాల నేపథ్యంలో, బాధితురాలికి న్యాయం జరగాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళా హక్కుల సంఘాలు సుప్రీంకోర్టు వెలుపల భారీ నిరసన చేపట్టాయి. ప్రస్తుతం బాధితురాలు తన న్యాయపోరాటాన్ని కొనసాగించేందుకు సిద్ధంగా ఉందని, అత్యున్నత న్యాయస్థానంపై తమకు పూర్తి నమ్మకం ఉందని బాధితురాలి మద్దతుదారులు పేర్కొన్నారు.