Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page slider

పీపీపీ ‘మెడికల్’కు బాబు గ్రీన్ సిగ్నల్

అమరావతి: పేదలకు నాణ్యమైన, కార్పొరేట్ స్థాయి వైద్యం అందించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. పీపీపీ (ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య) విధానంలో వైద్య కళాశాలల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో వైద్యారోగ్య శాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైద్య సేవల్లో నాణ్యత పెంచేందుకు ఈ విధానం అత్యంత ఆవశ్యకమని స్పష్టం చేశారు.

విమర్శలకు చెక్.. అది ప్రైవేటీకరణ కాదు!
మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ముఖ్యమంత్రి ఘాటుగా తిప్పికొట్టారు. “పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు.. ప్రభుత్వ పర్యవేక్షణలోనే ఈ కాలేజీలు నడుస్తాయి. రోడ్లు పీపీపీలో కడితే అవి ప్రైవేటు వ్యక్తులవి ఎలా కావొ? మెడికల్ కాలేజీలు కూడా అలాగే ప్రభుత్వ కాలేజీలుగానే కొనసాగుతాయి. ఈ కాలేజీలలో 70 శాతం బెడ్లను పేదలకు ఉచిత వైద్యం కోసం కేటాయిస్తాం. అంతేకాకుండా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి” అని సీఎం భరోసా ఇచ్చారు.

వీజీఎఫ్ (VGF) ద్వారా ఆర్థిక దన్ను
కేంద్ర ప్రభుత్వం సూచించిన వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF) మార్గదర్శకాలను ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ విధానం కింద అయ్యే వ్యయంలో కేంద్ర ప్రభుత్వం 30 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తాయి. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఈ విధానం విజయవంతమైందని, ఆంధ్రప్రదేశ్‌లో కూడా దీని ద్వారా తక్కువ సమయంలో అత్యాధునిక మౌలిక వసతులు కల్పించవచ్చని సీఎం వివరించారు.

ఆదోని నుంచే శ్రీకారం.. టెండర్లు వేగవంతం
తొలి విడతగా ఆదోని మెడికల్ కాలేజీ నిర్మాణానికి ముందుకు వచ్చిన సంస్థలతో వెంటనే ఒప్పందాలు చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఆదోనితో పాటు మదనపల్లి, పులివెందుల, మార్కాపురం మెడికల్ కాలేజీల టెండర్ల ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు.