ప్రభుత్వంపై వ్యతిరేకతే చేరికలకు నిదర్శనం
విశాఖపట్నం:విశాఖపట్నంలో వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్న తరుణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతే ఈ చేరికలకు నిదర్శనమని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. సోమవారం వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఏరినా వద్ద పార్టీ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయగా, ఆఖరి నిమిషంలో అధికారులు అనుమతులు నిరాకరిస్తూ గేట్లకు తాళం వేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు అనుమతి తీసుకున్నప్పటికీ ఇలా అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్ల ఉన్న భయంతోనే కూటమి నేతలు ఇటువంటి అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు.
“అనుమతి పొందిన తర్వాత థియేటర్ ఇవ్వకపోవడం దారుణం. దళితులు వైఎస్సార్సీపీలో చేరకూడదా? వారికి ఈ ప్రాంగణంలోకి అడుగుపెట్టే అర్హత లేదా?” అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకు దళితులంటే అంత చిన్నచూపా అని నిలదీశారు. అధికారుల చర్యను నిరసిస్తూ వైఎస్సార్సీపీ నేతలు కేకే రాజు , ఇతర కార్యకర్తలు గేటు వద్దే ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు, దీనితో ఆ ప్రాంతంలో పరిస్థితి స్వల్పంగా ఉద్రిక్తంగా మారింది.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం నాడు చంద్రబాబు నాయుడుపై చేసిన విమర్శలను గుడివాడ అమర్నాథ్ సమర్థించారు. కేసీఆర్ ఎప్పుడూ అబద్ధాలు ఆడరని, అందుకే ఆయన అంత పెద్ద నేత అయ్యారని కొనియాడారు. పాలమూరు ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వంలో ఉన్నవారు ప్రజల కోసం ఆలోచించాలి తప్ప, కేవలం కొడుకు , కుటుంబ ప్రయోజనాల కోసం కాదని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
కూటమి నేతల ఒత్తిడి వల్లే అధికారులు ఇలా ప్రవర్తిస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకూడదని కేకే రాజు హితవు పలికారు. చంద్రబాబు, లోకేశ్ వంటి నేతలు జగన్ ముందు తక్కువ స్థాయి నేతలని అమర్నాథ్ ఎద్దేవా చేస్తూ, తమ పార్టీలోకి వస్తున్న భారీ స్పందనను చూసి ప్రభుత్వం భయపడుతోందని అన్నారు.

