అసెంబ్లీకి రారు.. తోలు తీస్తారా?
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి శాసనసభకు రాకుండా, బయట ఉండి ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం కేసీఆర్‌కు తగదని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా మండిపడ్డారు. సోమవారం గాంధీ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రెండేళ్ల పాటు ఫామ్‌హౌస్‌కే పరిమితమై, ఇప్పుడు బయటకు వచ్చి ‘తోలు తీస్తాం’ అంటూ మాట్లాడటం ప్రజాస్వామ్యంలో అహంకారానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. తాము ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వమని, ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌కు తగిన గౌరవం ఇచ్చి అసెంబ్లీకి రమ్మని స్వయంగా ముఖ్యమంత్రి, స్పీకర్ కోరినప్పటికీ రాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏం చేసిందో అసెంబ్లీ వేదికగా చర్చించి ప్రజల ముందు ఉంచాలని సవాల్ విసిరారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా భ్రష్టు పట్టించిందని, పెండింగ్‌లో ఉన్న మెస్ బకాయిలు, హాస్టల్ అద్దెలను తాము అధికారంలోకి వచ్చాక చెల్లిస్తూ వస్తున్నామని పేర్కొన్నారు. కుర్చీ వేసుకుని మరీ పూర్తి చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చిన గౌరవెల్లి ప్రాజెక్టు ఏమైందని, ఆయన కట్టిన కాళేశ్వరం పరిస్థితి ఏంటో ప్రజలందరికీ తెలుసని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు.

