Breaking Newshome page sliderHome Page Slidermovies

హైటెక్స్‌లో ఏకాగ్ర ఇంటర్నేషనల్ ఓపెన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్ ప్రారంభం

హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ రెండో హాల్‌లో ఏకాగ్ర ఇంటర్నేషనల్ ఓపెన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్‌ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ— పిల్లల్లో ఏకాగ్రతను పెంపొందించడంలో, మేధాశక్తి వికాసంలో చెస్ ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ క్రీడలో ఎదగాలంటే కష్టపడి సాధన చేయాల్సిందేనని, నిరంతర శ్రమే విజయానికి మార్గమని సూచించారు. హైదరాబాద్‌లో ఇలాంటి అంతర్జాతీయ స్థాయి చెస్ టోర్నమెంట్ నిర్వహించడం సంతోషకరమని పేర్కొన్నారు. గెలుపు–ఓటములు ఆటలో సహజమని, గెలిచినా ఓడినా మళ్లీ మళ్లీ ఆడుతూ ముందుకు సాగితే ఒక రోజు తప్పకుండా విజయం వరిస్తుందన్నారు. పిల్లలలో ఉన్న ఆసక్తిని తల్లిదండ్రులు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కార్యక్రమం ప్రారంభంలో ఏకాగ్ర అకాడమీలో శిక్షణ పొంది ఫిడే రేటింగ్ సాధించిన హైదరాబాద్‌కు చెందిన కవలలు అమాయ అగర్వాల్, అనయ్ అగర్వాల్‌లను అకాడమీ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ— తెలంగాణలో రూ.22,22,222 భారీ ప్రైజ్ మనీతో ఈ టోర్నమెంట్ నిర్వహించడం ఆనందకరమని అన్నారు. నాంపల్లి నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే ఫెరోజ్ ఖాన్ చిన్నారుల నుంచి పెద్దల వరకు పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రాండ్‌మాస్టర్లు, అంతర్జాతీయ మాస్టర్లు, కోచ్‌లు, పిల్లల తల్లిదండ్రులతో పాటు ప్రైమ్ 9 వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, అకాడమీ డైరెక్టర్లు సందీప్ నాయుడు, చైతన్య, గిరీష్ రెడ్డి, సౌజన్య జాను తదితరులు పాల్గొన్నారు.