‘నన్ను’ సస్పెండ్ చేశారు.. మరి ‘అతని’ సంగతేంటి?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ ఉదంతం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. గత కొంతకాలంగా వరుస ట్వీట్లు, రాజకీయ వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్న ఆయన, తాజాగా నేరుగా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. దర్యాప్తు సక్రమంగా జరగడం కోసం తనను సస్పెండ్ చేయడం సబబే అయితే, అదే సూత్రం రఘురామకృష్ణరాజుకు కూడా వర్తించాలని డిమాండ్ చేశారు. బ్యాంకు రుణాల ఎగవేత కేసులో రఘురామపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఆయనను కూడా అన్ని పదవుల నుంచి తొలగించాలని పీవీ సునీల్ ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.
ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న సునీల్ కుమార్, గత ప్రభుత్వ హయాంలో తాను చేసిన పనులపై జరుగుతున్న విచారణలను ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనపై దర్యాప్తు సక్రమంగా జరగడం కోసం ప్రభుత్వం తనను సస్పెండ్ చేసినప్పుడు, సీబీఐ దర్యాప్తు ఎదుర్కొంటున్న రఘురామను ఎందుకు పదవుల్లో కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానమే అయితే, సమన్యాయం కోసం రఘురామను పదవుల నుంచి తీసేయాలని, అప్పుడే సమాజంలోకి సరైన సందేశం వెళ్తుందని ఆయన పేర్కొన్నారు. రఘురామపై నేరుగా ఇలాంటి రాజకీయ ఆరోపణలు చేయడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
సునీల్ కుమార్ మరియు రఘురామ మధ్య ఈ వైరం సుదీర్ఘ కాలంగా కొనసాగుతోంది. 2021లో అప్పటి నరసాపురం ఎంపీగా ఉన్న రఘురామను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు పీవీ సునీల్ సీఐడీ చీఫ్‌గా ఉన్నారు. ఆ సమయంలో తనను కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారని రఘురామ చేసిన ఆరోపణలపై ప్రస్తుతం సిట్ విచారణ జరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సునీల్ కుమార్, రెండు రోజుల క్రితమే విచారణకు హాజరయ్యారు. మరోవైపు, అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారన్న కారణంతో ఇప్పటికే సునీల్ కుమార్ సస్పెన్షన్ వేటును ఎదుర్కొంటున్నారు.
మరోవైపు సునీల్ కుమార్ తీరుపై రఘురామకృష్ణరాజు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. సర్వీసులో ఉండి రాజకీయ వ్యాఖ్యలు చేయడం, కులాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడటం సర్వీస్ రూల్స్‌ను ఉల్లంఘించడమేనని రఘురామ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనను సర్వీస్ నుంచి పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేశారు. ఒక ఐపీఎస్ అధికారి ఇలా నేరుగా ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం, ప్రత్యారోపణలు చేసుకోవడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ప్రభుత్వ వర్గాల నుంచి దీనిపై ఎలాంటి స్పందన వస్తుందోనని రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

