ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు కొట్టివేత
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ ప్రసాద్‌కుమార్ తీర్పు బుధవారం వెలువరించారు. తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టి వేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టు ఆధారాలు లేవని తీర్పులో పేర్కొన్నారు. అనర్హత వేటుకు తగిన ఆధారాలు లేవని, సాంకేతికంగా ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు భారత రాష్ట్ర సమితిలోనే ఉన్నట్టు స్పష్టం చేశారు.ఈ మేరకు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. దీంతో అనర్హత వేటు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ఐదుగురు ఎమ్మెల్యేలకు భారీ ఊరట లభించినట్లైంది.కాగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ భారత రాష్ట్ర సమితి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే . ఈ అంశంపై పలుమార్లు విచారణ కూడా జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ తన నిర్ణయాన్ని బుధవారం ప్రకటించారు. కాగా గురువారం మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసులో స్పీకర్ తీర్పును ప్రకటించనున్నారు. అనర్హత పిటిషన్ల కేసులో శుక్రవారంతో తో సుప్రీంకోర్టు విధించిన గడువు ముగియనుంది.
న్యాయపోరాటం చేస్తామన్న బీఆర్ఎస్ నేతలు
తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన తీర్పుపై భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, కె.సంజయ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు . స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్తామని ప్రకటించారు. తమ వాదనలను పరిగణనలోకి తీసుకోకుండా, కనీసం సమగ్ర విచారణ జరపకుండా కేవలం ఒక ‘సింగిల్ లైన్ స్టేట్‌మెంట్’తో పిటిషన్లను తోసిపుచ్చడం రాజ్యాంగ విరుద్ధమని వారు మండిపడ్డారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు బహిరంగంగా కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసినా, ఆధారాలు లేవని చెప్పడం సరికాదని, ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు అనుగుణంగానే స్పీకర్ ఈ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నట్లు వారు ఆరోపించారు. సుప్రీంకోర్టు హెచ్చరికల వల్లే స్పీకర్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారని పేర్కొంటూ, పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లాలని వారు డిమాండ్ చేశారు. ఈ అంశంపై తాము చేసే న్యాయపోరాటంలో ఖచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అపహాస్యం చేసింది : మాజీ మంత్రి హరీశ్ రావు
ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో స్పీకర్ ఇచ్చిన తీర్పుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రంగా మండిపడుతూ, కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తోందని ధ్వజమెత్తారు. రాజ్యాంగం విషయంలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఒక మాట, తెలంగాణలో మరో మాట మాట్లాడుతోందని.. రాహుల్ గాంధీ ఇచ్చే రాజ్యాంగ రక్షణ నినాదాలు తెలంగాణకు వర్తించవా అని ఆయన నిలదీశారు. స్పీకర్ నిర్ణయంతో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి మరోసారి బట్టబయలైందని, రాజకీయ లబ్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను కూడా దిగజారుస్తోందని ఆరోపించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఫిరాయింపుల నిరోధక చట్టం నియమాలను పూర్తిగా తుంగలో తొక్కి, అధికార పార్టీకి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగాన్ని కాలరాయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సేవ్ ది కాన్సిట్యూషన్’ అనే నినాదం కేవలం మాటలకే పరిమితమైందని, ఆచరణలో రాజ్యాంగ విలువల ఉల్లంఘన ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని హరీశ్ రావు విమర్శించారు.
స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు : మాజీ ఎంపీ వినోద్ కుమార్
తెలంగాణ స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అని వినోద్ కుమార్ విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాము పార్టీ మారామని సదరు ఎమ్మెల్యేలే స్వయంగా ప్రకటించినప్పటికీ, వారు పార్టీ మారలేదని స్పీకర్ తీర్పు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఈ నిర్ణయం ద్వారా రాజీవ్ గాంధీ హయాంలో రూపొందించిన 10వ షెడ్యూల్ ఒక పనికిమాలిన చట్టమని కాంగ్రెస్ పార్టీయే స్వయంగా దేశ ప్రజలకు చెప్పినట్లయ్యిందని మండిపడ్డారు. పార్టీ పిరాయించినా కూడా, స్పీకర్ దగ్గర మారలేదని చెబితే సరిపోతుందనేలా ఈ తీర్పు ఉందని, తద్వారా కాంగ్రెస్ పార్టీ తాను తెచ్చిన చట్టాన్ని తానే చంపేసిందని ఆయన ధ్వజమెత్తారు. ఇకనైనా రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌కు తగిన సవరణలు చేయాలని, పార్లమెంట్‌లో పార్టీ పిరాయింపులపై తక్షణమే ఒక ప్రత్యేకమైన మరియు పటిష్టమైన చట్టాన్ని తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.

