H-1B, H-4 వీసాల పై ట్రంప్ కొరడా
హెచ్-1బీ, హెచ్-4 వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలపై నిశిత పరిశీలన (వెట్టింగ్ ) తనిఖీలపై అమెరికా కఠిన వైఖరి ఆవలంబిస్తోంది. సోమవారం నుంచి వైట్ హౌస్ ప్రభుత్వ ఉత్తర్వులను అమల్లోకి తీసుకువచ్చింది. తాజాగా అమల్లోకి వచ్చిన ఈ కొత్త విధానంతో అమెరికాలోకి ప్రవేశించడానికి “అనర్హులు”గా పరిగణించబడే వారిని గుర్తించడమే ప్రధాన లక్ష్యంగా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సర్కార్ పెట్టుకుంది. ట్రంప్ ప్రభుత్వం వలస విధానాలపై కఠిన వైఖరిని అవలంబిస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు ప్రాధాన్యం సంతరించుకుంది. వలసలను నియంత్రించాలనే లక్ష్యంతో ఈ తనిఖీలను అధికారులు ప్రారంభించారు.
అమెరికాలో ఐటీ, ఇతర ఉద్యోగాల కోసం వెళ్లే విదేశీ నిపుణులు హెచ్1బీ వీసాలకు, వారి కుటుంబ సభ్యులు హెచ్4 వీసాలకు దరఖాస్తు చేసుకుంటారు. విదేశాల నుంచి వచ్చిపడుతున్న నిపుణుల వలసలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా వైట్ హౌస్ నిబంధనల్లో మార్పులు తీసుకువచ్చి ఆమలుచేస్తోంది. దీంతో అగ్రరాజ్యంలో ఎక్కడ దొరికినా ఈ వీసా దరఖాస్తు తిరస్కరించడమే ధ్యేయంగా పనిచేస్తోంది. ఈ పరిణామాల మధ్య దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను నిశితంగా పరిశీలించనుంది. అమెరికా వీసా అనేది “హక్కు కాదు, ఒక ప్రత్యేక అధికారం” మాత్రమేని ట్రంప్ సర్కార్ స్పష్టం చేస్తోంది. అమెరికా ప్రభుత్వం జారీ చేసిన ప్రతి వీసా మంజూరు జాతీయ భద్రతకు సంబంధించిన నిర్ణయమేనని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. విదేశీ నిపుణులకు జారీ చేసే హెచ్-1బీ వీసాను, అమెరికా కంపెనీలు ఇతర దేశాల నుంచి నిపుణులను నియమించుకునేందుకు వాడుకుంటున్నాయని వైట్ హౌస్ ప్రభుత్వ అధికారులు తెలిపారు. సాంకేతిక నిపుణులు, ఇతర రంగాల నుంచి నిపుణులు ఈ వీసా ద్వారా అమెరికాలో పని చేసే అవకాశం పొందుతారని ఉందని అధికారులు వివరించారు.
ఈ హెచ్-1బీ వీసా కార్యక్రమం ద్వారా అత్యధికంగా లబ్ధి పొందుతున్నవారు భారతీయులేనని వైట్ హౌస్ పేర్కోంది. హెచ్-1బీ వీసాలు 70 శాతానికి పైగా భారతీయులకే జారీ చేస్తున్న నేపధ్యంలో , అమెరికా ప్రభుత్వ లెక్కల ప్రకారం తాజా ఉత్తర్వులతో భారతీయులే ఎక్కువగా నష్టపోవడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి . ఆ తర్వాత 11 నుండి 12 శాతం వీసాలతో చైనా పౌరులు రెండో స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం అమెరికాలో దాదాపు 3 లక్షల మంది భారతీయ హెచ్-1బీ వీసాదారులు సాంకేతిక, సేవా రంగాల్లో కొనసాగుతున్నారు. ఈ నిబంధన అమలులోకి రాకముందే, భారత్ లో అమెరికా రాయబార కార్యాలయం వీసా ఇంటర్వ్యూలను వాయిదా వేసింది. దీంతో చాలా మంది దరఖాస్తుదారులు చిక్కుకుపోయి, వారి ప్రయాణ ప్రణాళికలు ఆటంకంగా మారింది.

