Andhra PradeshBreaking Newshome page sliderHome Page Slider

అధికారం ఇచ్చింది …ఇళ్లు కూల్చడానికా..?

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయస్థానం నుండి తాత్కాలిక ఊరట లభించినప్పటికీ, 42 కుటుంబాలకు చెందిన ఇళ్లను అన్యాయంగా కూల్చివేసి, వారిని రోడ్డున పడేశారని ఆయన విమర్శించారు. భవానీపురం జోజి నగర్‌కు చేరుకున్న జగన్‌మోహన్‌రెడ్డి, కూల్చివేతకు గురైన ఇళ్ల యజమానులను కలిసి, వారిని పరామర్శించి, వారికి అండగా ఉంటామని మంగళవారం భరోసా ఇచ్చారు.

బాధిత కుటుంబాలను పరామర్శించిన తర్వాత మాజీ ముఖ్య మంత్రి మీడియాతో మాట్లాడుతూ, కూల్చివేత వెనుక ఉన్న అక్రమాన్ని ఎత్తిచూపారు. “ఈ 42 కుటుంబాలు గత 25 ఏళ్లుగా ఇక్కడే ఇళ్లు కట్టుకుని జీవిస్తున్నాయి. మున్సిపల్‌ కార్పొరేషన్‌ నుండి సరైన అనుమతి కూడా ఉంది. అయినప్పటికీ వీళ్ల ఇళ్లను ధ్వంసం చేశారు” అని ఆయన తెలిపారు. ఈ కూల్చివేతలకు సంబంధించిన పిటిషన్‌ సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉందని, ఈ నెల 31వ తేదీ వరకు కూల్చివేతలు జరగకుండా సుప్రీం కోర్టు వీళ్లకు ఊరట ఇచ్చినప్పటికీ, ప్రభుత్వ యంత్రాంగం కూల్చివేతలకు పాల్పడిందని ఆయన ధ్వజమెత్తారు.

ఈ కూల్చివేతల వెనుక ప్రభుత్వ పెద్దల ప్రమేయం స్పష్టంగా ఉందని వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. “సుమారు 200 మంది పోలీసులు ప్రైవేట్‌ పార్టీకి మద్దతుగా ఈ కూల్చివేతలు జరిపారు. ప్రైవేట్‌ వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే ఈ కూల్చివేతలు జరిగాయి” అని ఆయన తీవ్రంగా విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తూ, న్యాయస్థాన ఉత్తర్వులను కూడా లెక్కచేయకుండా ఇక్కడి ప్రజలను రోడ్డుపాలు చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.