ఏపీలో హోరెత్తిన ‘కోటి సంతకాల ఉద్యమ’ ర్యాలీలు
తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంలో ప్రైవేటీకరించాలనే రాష్ట్ర కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ‘కోటి సంతకాల ఉద్యమం’ ర్యాలీలకు అపూర్వ స్పందన లభించింది. సోమవారం నాడు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గాల్లో భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు, బైక్ ర్యాలీలు నిర్వహించారు. ఈ ఉద్యమంలో భాగంగా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి, సంతకాలు చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్య కళాశాలలు ప్రైవేటు చేతుల్లోకి వెళ్లడం వల్ల పేద ప్రజలకు వైద్యం, విద్య భారంగా మారుతుందనే ఆందోళన ఈ ర్యాలీల్లో ప్రధానంగా కనిపించింది.
అనంతపురంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ జిల్లా కార్యాలయం నుంచి బుక్కరాయసముద్రం వైఎస్సార్ విగ్రహం దాకా ఈ ర్యాలీ కొనసాగింది. వైసీపీ జిల్లా అధ్యక్షుడు,మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తదితరులు పాల్గొన్నారు.ప్రజల నుంచి సేకరించిన కోటి సంతకాల ప్రతులను ర్యాలీలో ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.ప్రకాశం జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాల నుంచి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. మార్కాపురం ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాట్లాడుతూ, వైఎస్ జగన్ మంజూరు చేసి నిర్మాణం చేపట్టిన మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడం పశ్చిమ ప్రకాశానికి చేసిన తీవ్ర అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి ప్రజలు వైద్యం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతుందని అన్నారు. మార్కాపురం నియోజకవర్గంలోనే 85 వేల మంది ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు చేసినట్లు తెలిపారు.మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఇచ్చిన పిలుపు మేరకు నంద్యాల జిల్లాలోనూ ప్రజలు భారీగా తరలివచ్చారు. నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, కాటసాని రామిరెడ్డి, ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి, డాక్టర్ దారా సుధీర్ తదితరులు పాల్గొన్నారు.ఈ జిల్లాలోనూ ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమం విజయవంతమైంది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తాయి. రాయచోటిలో చిత్తూరు – కర్నూలు జాతీయ రహదారిలో శివాలయం నుంచి నేతాజీ సర్కిల్ వరకు భారీ ర్యాలీ జరిగింది.”పేదలకు అండ వైఎస్ జగన్. కార్పొరేట్‌లకు అండ చంద్రబాబు. సీఎం డౌన్.. డౌన్” అంటూ ప్రజలు నినాదాలు చేశారు. జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి సేకరించిన ఈ కోటి సంతకాల పత్రాలను ఈ నెల 18న (బుధవారం) మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో గవర్నర్‌ను కలిసి సమర్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునేంతవరకూ ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని వైసీపీ నేతలు స్పష్టం చేశారు.

