టీడీపీ నైతికంగా ఓడినట్టే …
నెల్లూరు:నెల్లూరు నగర రాజకీయాల్లో అధికార కూటమి తీరుపై మాజీ మంత్రి, వైసీపీ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ అరాచక పాలన తారాస్థాయికి చేరిందని విమర్శించిన ఆయన, పోలీసులు నిఘా, భద్రతను పక్కన పెట్టి కార్పొరేటర్లకు డెలివరీ బాయ్ పనులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నెల్లూరు నగరంలో వైసీపీ బలంగా ఉందని, టీడీపీ నైతికంగా ఓడిపోయిందని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని టీడీపీ రాజకీయాలు చేస్తోందని ఆరోపించిన ఆయన, నగరంలో గంజాయి బ్యాచ్, రౌడీయిజం పెరిగిపోయిందని మండిపడ్డారు. నెల్లూరు సిటీ ఐదో డివిజన్ కార్పొరేటర్ రవిచంద్రను కిడ్నాప్ చేశారని పేర్కొంటూ, మంత్రి నారాయణ దిగజారి రాజకీయాలు చేస్తున్నారని, నెల్లూరులో దళారి వ్యవస్థ నడుస్తోందని ఆయన విమర్శించారు.
నెల్లూరు కార్పొరేషన్ వ్యవహారంపై మాట్లాడిన అనిల్ కుమార్ యాదవ్, తమ పార్టీకి సంబంధం లేని మేయర్‌పై అవిశ్వాసం పెట్టి వైసీపీపై ట్రోల్స్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కార్పొరేషన్‌లో ఉన్న 54 మంది కార్పొరేటర్లలో మెజారిటీ మంది వైసీపీ బీఫాంతో గెలిచిన వారేనని గుర్తుచేశారు. నయానో, భయానో వారిని ప్రలోభ పెట్టి టీడీపీలోకి లాక్కున్నారని ఆరోపించారు. ప్రస్తుతం వైసీపీకి పదకొండు మంది కార్పొరేటర్లు ఉన్నారని, అయితే నిన్న ఐదుగురు జగనన్న హయాంలో తమ పార్టీలో చేరారని చెప్పారు. అలా తమ పార్టీలో చేరిన కార్పొరేటర్ ఒక్కరిని అరెస్ట్ పేరుతో డ్రామా క్రియేట్ చేశారని ఆయన అన్నారు.
టీడీపీ అధికారంలో ఉండి, సంఖ్య బలం ఉన్నా కూడా క్యాంపు రాజకీయాలు చేస్తోందని అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. “మాకు సంఖ్య బలం లేదు, మేయర్ మా పార్టీ కాదు. ఐదు మంది మా వైపు వచ్చేసరికి భయపడ్డారు. మాకు భయపడి కార్పొరేటర్లను క్యాంపునకు తరలించినప్పుడే మేము నైతికంగా గెలిచాం” అని ఆయన వ్యాఖ్యలు చేశారు.

