Breaking Newshome page sliderHome Page SliderTelangana

క్షమాపణ చెప్పకపోతే కోర్టుకు ఈడుస్తా

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో తనపై వస్తున్న తప్పుడు ప్రచారాలపై తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్‌తో అంటకాగుతున్నట్లు తనపై జరుగుతున్న వెకిలి చేష్టలకు పాల్పడుతున్న గుంట నక్కలు జాగ్రత్త అని ఆమె హెచ్చరించారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు . వారం రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే కోర్టుకు ఈడుస్తానని నోటీసులు పంపుతున్నట్లు తెలిపారు. తనకు ఎవరితోనూ విభేదాలు లేవని, వ్యాపారాలు లేవని స్పష్టం చేశారు. కృష్ణారావు చాలా చిన్న వ్యక్తి అని, ఒక గుంట నక్క ఆయన వెనుక ఉండి ఆడిస్తోందని ఆరోపించారు. ఏవీరెడ్డితో పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి భూలావాదేవీలు ఉన్నాయని, శ్రీనివాస్‌రెడ్డి ఎవరి బినామీనో చెప్పాలని డిమాండ్ చేశారు. కృష్ణారావు కుమారుడు డైరెక్టర్‌గా ఉన్న కంపెనీల విల్లాలన్నీ కబ్జాల్లో కట్టినవేనని, వెంచర్ మధ్యలోని చెరువు 10 ఎకరాల నుంచి 6 ఎకరాలకు ఎలా తగ్గిందో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, హైడ్రా చూడాలని కోరారు. కేటీఆర్‌ మంత్రిగా ఉన్న సమయంలో అభివృద్ధి పేరిట చెరువునే మింగేశారని ఆరోపించారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనతో తనకు సంబంధం లేదని, ఎంపీగా ఉన్నప్పుడు దిల్లీ, నిజామాబాద్‌కే పరిమితమయ్యానని చెబుతూ, “పార్టీ నుంచి వెళ్లగొట్టారు కదా.. ఇంకా కళ్లు చల్లబడలేదా?” అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ హిల్ట్‌ పాలసీకి కిటికీలు తెరిస్తే, కాంగ్రెస్ ద్వారాలు తెరుస్తోందని విమర్శించారు. గత ప్రభుత్వంలో చాలా తప్పిదాలు జరిగాయని, దేవుడి దయతో తాను ముఖ్యమంత్రి అవుతానని, 2014 నుంచి జరిగిన అన్ని అన్యాయాలను వెలికితీస్తానని ఆమె వ్యాఖ్యానించారు.