Andhra PradeshBreaking Newshome page sliderHome Page Slider

నెల్లూరు జిల్లా నిమ్మ రైతుల కన్నీటి కష్టం

నెల్లూరు:నిమ్మ పంటకు ప్రసిద్ధి చెందిన నెల్లూరు జిల్లాలోని గూడూరు, పొదలకూరు నిమ్మ మార్కెట్‌లలో రైతులు ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు. పంట ఉత్పత్తికి దిగుబడి బాగానే ఉన్నప్పటికీ, మార్కెట్‌లో ధరలు అనూహ్యంగా పడిపోవడంతో రైతన్నలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కేవలం రెండు నెలల క్రితం వరకు కేజీ నిమ్మకాయలు రూ.30 చొప్పున పలికిన ధరలు అకస్మాత్తుగా పడిపోయి, ప్రస్తుతం వేలంలో కేజీ నిమ్మకాయలు కేవలం రూ.10 మాత్రమే పలుకుతుండటం రైతులను నిస్సహాయ స్థితికి నెట్టింది. రెండేళ్లలో ఎప్పుడూ లేని విధంగా ధరలు ఇంత తక్కువకు పడిపోవడం పట్ల రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు, పెట్టుబడి కూడా దక్కడం లేదని వాపోతున్నారు.

రైతులు తమ పంటకు గిట్టుబాటు ధర దక్కకపోవడానికి మార్కెట్‌లో వ్యాపారుల దోపిడీనే కారణమని తీవ్రంగా ఆరోపిస్తున్నారు. తమ వద్ద కేజీ నిమ్మకాయలు పది రూపాయలకే కొనుగోలు చేస్తున్న వ్యాపారులు, అదే సమయంలో పొదలకూరులోని హోల్‌సేల్ దుకాణాల్లో కిలో రూ.30కి, గూడూరులోని హోల్‌సేల్ దుకాణాల్లో కిలో రూ.40 చొప్పున అమ్ముతున్నట్లు రైతులు చెబుతున్నారు. ఈ భారీ వ్యత్యాసం కారణంగా తాము నష్టపోతుంటే, వ్యాపారులు మాత్రం అధిక లాభాలు గడిస్తున్నారని నిమ్మ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దోపిడీని వెంటనే అరికట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో, నిమ్మ రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని విన్నవించుకుంటున్నారు. వ్యవసాయ మార్కెట్ సమస్యలపై దృష్టి సారించి, తమకు గిట్టుబాటు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వం కనీసం మానవతా కోణంలోనైనా రైతుల అండగా నిలవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ సమస్యలకు పరిష్కారం చూపకపోతే, తమకు ఆత్మహత్యలే దిక్కవుతాయని రైతులు కన్నీరు పెట్టుకున్నంత పని చేస్తున్నారు. రైతు సంక్షేమమే రాష్ట్ర సంక్షేమం అని స్పష్టం చేస్తున్న రైతులు, తమ ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.