కూటమి నియంత పాలనలో రాష్ట్రం దెబ్బతింటోంది
అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నియంత పాలన కొనసాగిస్తోందని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ, “నారా లోకేష్ నేతృత్వంలో విధ్వంసపాలన నడుస్తోంది. రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ నీరుగారిపోతున్నాయి” అని మండిపడ్డారు.
సజ్జల మాట్లాడుతూ, కేవలం వాంగ్మూలాల ఆధారంగా కూటమి ప్రభుత్వం తమకు ఇష్టంలేని వారిని జైళ్లలో వేస్తోందని ఆరోపించారు. మాజీ మంత్రి జోగి రమేష్‌ను అక్రమ మద్యం కేసులో ఇరికించి జైలుకు పంపారని, ఆయన ఇంట్లో పెన్ డ్రైవ్‌లు, హార్డ్‌డిస్క్‌లు దొరికాయని చేస్తున్న ప్రచారం పూర్తిగా తప్పుడు దుష్ప్రచారమని తెలిపారు.
అలాగే, అక్రమ మద్యం విక్రయాలు టీడీపీ నాయకుల కనుసన్నల్లో జోరుగా సాగుతున్నప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. కూటమి నేతలే అక్రమాలకు పాల్పడి, ఆ బాధ్యతను వైసీపీ నాయకులపై మోపే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.
తిరుపతి, సింహాచలం ఆలయాల్లో జరిగిన తొక్కిసలాట ఘటనలు మరవకముందే కాశీబుగ్గ ఆలయంలో జరిగిన సంఘటనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు పాలన అంతా డొల్లతనం, రాజకీయ ప్రతీకారాలతో నిండి ఉందని సజ్జల విమర్శించారు.

