Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page sliderNewsPolitics

అసెంబ్లీలో బోండా ఉమా vs పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ శుక్రవారం సమావేశాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బోండా ఉమా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మధ్య కాసేపు రసవత్తర ఎపిసోడ్ సాగింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ పీ. కృష్ణయ్యపై బోండా ఉమా చేసిన ఆరోపణలతో సభలో చర్చ వేడెక్కింది.

బోండా ఉమా ఆరోపణలు:
విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ,“ఎమ్మెల్యేల లేఖలు వస్తే 30–40 ఏళ్లుగా ఇలాంటి వారిని చూసినట్లు కృష్ణయ్య వ్యాఖ్యానించడం సరికాదు. ఎమ్మెల్యేలు గెలిస్తేనే కృష్ణయ్య చైర్మన్‌ అయ్యారు అన్న విషయం మర్చిపోవద్దు. ఇప్పుడు ఆయన దగ్గరకు వెళ్తే పవన్ కల్యాణ్‌ను కలవాలని చెబుతున్నారు. ఇది ప్రజా ప్రతినిధుల గౌరవానికి భంగం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాంటి అధికారులను సరిదిద్దాలి” అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

పవన్ కల్యాణ్ ఖండన:
ఈ ఆరోపణలకు వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానిస్తూ,“నేను అందుబాటులో ఉండడం లేదన్న మాట తప్పు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పరిశ్రమలతో సంబంధం కలిగి ఉంటుంది. కృష్ణయ్య చైర్మన్ అయ్యాకే ప్రజల అనుమానాలకు సమాధానమివ్వడం ప్రారంభమైంది. పారిశ్రామిక వేత్తలను భయపెట్టే విధానాలు ఉండకూడదు. పర్యావరణ పరిరక్షణకు కావాల్సిన నిధులు కూడా ప్రభుత్వానికి లేవు. ఈ బాధ్యత అందరం కలసి పంచుకోవాల్సిందే” అని స్పష్టంచేశారు.

గ్యాలరీలోనే కృష్ణయ్య:
ఈ వాగ్వాదం జరుగుతుండగానే అధికారుల గ్యాలరీలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ పీ. కృష్ణయ్య కూర్చోవడం సభలో ఆసక్తికర దృశ్యంగా నిలిచింది. సభలో ఆయన పేరు చర్చకు రావడంతో గ్యాలరీలో ఉండటమే హైలైట్‌గా మారింది.