పెట్టుబడులకు చిరునామా హైదరాబాద్
హైదరాబాద్ పెట్టుబడులకు చిరునామాగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు . ఢిల్లీలో జరిగిన 12వ పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని “విజన్ తెలంగాణ రైజింగ్” అంశంపై ప్రసంగించారు. పెట్టుబడులకు హైదరాబాద్ నగరమే గేట్‌వేగా మారిందని, పెట్టుబడిదారులకు అనుగుణంగా నగరాన్ని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఐటీ, ఫార్మా వంటి రంగాలకు అవసరమైన రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్లను నిర్మిస్తున్నామని, కోర్ సిటీలోని పరిశ్రమలను ఓఆర్ఆర్ వెలుపలకు తరలిస్తామని వెల్లడించారు. రూరల్ ప్రాంతాల్లో కూడా పరిశ్రమలను విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. హైదరాబాద్ ఓఆర్ఆర్, మెట్రో ద్వారా అద్భుతమైన కనెక్టివిటీ కలిగి ఉందని, సాంస్కృతిక కనెక్టివిటీలోనూ భాగ్యనగరం దేశానికి రోల్ మోడల్‌గా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రోజుకు 5 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తుండగా, రానున్న ఐదేళ్లలో దీన్ని 15 లక్షలకు పెంచడం లక్ష్యమని చెప్పారు. నగరంలో ప్రస్తుతం నడుస్తున్న 3 వేల ఆర్టీసీ బస్సుల స్థానంలో భవిష్యత్తులో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులనే నడపాలని నిర్ణయించినట్లు వివరించారు.
రాష్ట్ర అభివృద్ధిలో మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్ట్ కీలకమని, గుజరాత్‌లో సబర్మతీ రివర్‌ఫ్రంట్, ఢిల్లీలో యమునా రివర్‌ఫ్రంట్ తరహాలోనే మూసీ అభివృద్ధికి కేంద్ర సహకారం అవసరమని సీఎం అన్నారు. త్వరలోనే మూసీలో గోదావరి నీటిని ప్రవహింపజేస్తామని వెల్లడించారు. హైదరాబాదును విద్య, వైద్య రంగాల్లో జాతీయ స్థాయి హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని, శాంతి భద్రతల పరంగా తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ఉన్నదని గర్వంగా ప్రకటించారు. తెలంగాణ బ్రాండ్‌ను దేశవ్యాప్తంగా మరింతగా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉందని, పెట్టుబడిదారుల కోసం ప్రభుత్వం సదా మద్దతుగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. అలాగే హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్ అవసరమని, దీనిపై కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు.