రోహిత్ ను వన్ డే నుంచి తప్పించడానికేనా ఈ టెస్ట్
టీమిండియా క్రికెటర్ల ఫిట్‌నెస్‌ను అంచనా వేయడానికి ఇప్పటికే అమల్లో ఉన్న యోయో టెస్ట్‌తో పాటు మరో కొత్త పరీక్షను బీసీసీఐ ప్రవేశపెట్టింది. దీని పేరు బ్రాంకో టెస్ట్. రగ్బీ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను కొలవడానికి సాధారణంగా ఉపయోగించే ఈ పరీక్షను ఇకపై భారత క్రికెట్ జట్టులోనూ తప్పనిసరి చేశారు. ఆటగాళ్లు పూర్తిస్థాయి ఫిట్‌గా ఉన్నారని ధ్రువీకరించుకోవాలంటే యోయో టెస్ట్‌తో పాటు బ్రాంకో టెస్ట్‌ను కూడా క్లియర్ చేయాలి.ఈ కొత్త విధానం అమలుపై మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ తీవ్ర ఆరోపణలు చేశారు. రోహిత్ శర్మను వన్డే జట్టు నుంచి తప్పించడానికే ఈ బ్రాంకో టెస్ట్‌ను ప్రవేశపెట్టారని ఆయన విమర్శించారు.తివారీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…2027 వన్డే వరల్డ్ కప్ ప్రణాళికల నుండి విరాట్ కోహ్లీని పక్కన పెట్టడం అంత తేలిక కాదు. కానీ రోహిత్ శర్మను మాత్రం జట్టులోనుంచి తొలగించాలనుకుంటున్నారు. అందుకే బ్రాంకో టెస్ట్‌ను ప్రవేశపెట్టారు. ఈ పరీక్ష అత్యంత కఠినమైనది. రోహిత్ శర్మకు ఇది పాస్ కావడం కష్టమే. అతను ఫిట్‌నెస్‌పై మరింత దృష్టి పెట్టకపోతే జట్టులో కొనసాగడం కష్టమవుతుంది అని వ్యాఖ్యానించారు.కొత్త కోచ్ అడ్రియన్ లి రాక్స్ సూచనల మేరకు ఈ పరీక్షను అమలు చేశారు. అయితే దీని వెనుక ఉన్న ఉద్దేశ్యంపై తివారీ సందేహాలు వ్యక్తం చేశారు.బ్రాంకో టెస్ట్‌ను ఇప్పుడే ఎందుకు ప్రవేశపెట్టారు? కొత్త హెడ్‌కోచ్ వచ్చి మొదటి సిరీస్ నుంచే దీన్ని ఎందుకు అమలు చేయలేదు? అసలు ఇది ఎవరి ఆలోచన? ఈ ప్రశ్నలకు సమాధానం లేదు. కానీ ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. రోహిత్ శర్మను భవిష్యత్తులో వన్డే జట్టు నుంచి దూరం చేయడం కోసమే ఇది అని అన్నారు.బ్రాంకో టెస్ట్ ఒక రకమైన పరుగు పరీక్ష. ఎక్కువగా రగ్బీ ఆటగాళ్లలో శారీరక సామర్థ్యం, వేగం, మానసిక స్థైర్యాన్ని పరీక్షించడానికి ఉపయోగిస్తారు.ఈ పరీక్షలో ఒక ఆటగాడు ఆరు నిమిషాల వ్యవధిలో కనీసం 1200 మీటర్లు విరామం లేకుండా పరుగెత్తాలి.ఆటగాడి స్థైర్యం, స్పీడ్, మానసిక కట్టుదిట్టతను కొలవడంలో ఇది కీలకమైన ప్రమాణంగా పరిగణించబడుతుంది.తివారీ చేసిన ఈ వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఇప్పటికే టీ20, టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఇప్పుడు వన్డే ఫార్మాట్‌పైనే దృష్టి పెట్టారు. వీరిద్దరూ 2027 వరల్డ్ కప్ వరకు ఆడాలని సంకల్పించారు. అయితే, ఈ కొత్త ఫిట్‌నెస్ ప్రమాణాలు రోహిత్ భవిష్యత్తుపై ప్రశ్నార్థకాలు రేపుతున్నాయి.