ఏపీ ఆర్థిక వ్యవస్థ దిగజారింది: వైఎస్ జగన్
కూటమి పాలనలో ఆర్థిక వ్యవస్థ మరింతగా దిగజారిందని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దిగజారిందని గణాంకాలతో సహా పేర్కొన్నారు. కాగ్ విడుదల చేసిన మంత్లీ కీ ఇండికేటర్ ప్రకారం.. రాష్ట్ర ఆర్థిక స్థిరత్వం ప్రమాదంలో ఉందన్నారు. రాష్ట్రంలో సొంత ఆదాయాలు కేవలం 3.47 శాతం మాత్రమే పెరిగాయని, అప్పులు మూడు నెలల్లో 15.61 శాతం వేగంతో పెరిగాయని చెప్పారు. ఆర్థిక సంవత్సరం 2025–26 తొలి త్రైమాసికంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిదని జగన్ ఆరోపించారు.కాగ్ (CAG) తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ తీవ్ర ఒత్తిడిలో ఉంది.

రాష్ట్ర విభజన వల్లే ఈ పరిస్థితులు ఏర్పడాయని, ప్రజా ఆర్థిక నిర్వహణ ప్రత్యేకంగా రాష్ట్రానికి మింగుడు పడడం లేదు అని మాజీ సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. అవినీతి పరిపాలన కారణంగా రాష్ట్ర ఆదాయ వనరులన్నీ శూన్యస్థాయికి చేరుకున్నాయని, పన్నులు మరియు పన్నేతర ఆదాయ వర్గాల్లో ఆదాయ వృద్ధి నిరాశపరిచిందని తెలిపారు. ముఖ్యంగా జీఎస్టీ, అమ్మకపు పన్నుల్లో గత ఏడాదితో పోల్చితే మొదటి మూడు నెలల్లోనే వృద్ధి గణనీయంగా తగ్గిందని ఆయన వివరించారు. ఈ త్రైమాసికంలో రాష్ట్రానికి చెందిన సొంత ఆదాయం కేవలం 3.47% మాత్రమే పెరిగింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో కలిపిన రెవెన్యూ వృద్ధి 6.14% ఉండగా, అప్పుల వృద్ధి మాత్రం 15.61% గా నమోదైంది. ఇది ప్రభుత్వ వ్యయాలను నెరవేర్చేందుకు సొంత ఆదాయంపై కాకుండా ఇతర మార్గాలపై ఆధారపడాల్సిన పరిస్థితిని చూపుతోందని జగన్ మండిపడ్డారు. అంతిమంగా, ప్రజా వ్యయాలు అవసరమైన రంగాల్లోనే దృష్టిపెట్టి, వినియోగం మరియు పెట్టుబడుల వృద్ధిని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం నడిచే దిశగా ఉండాలని వైఎస్ జగన్ సూచించారు.