పట్టుదలతో చరిత్ర సృష్టించిన టీమిండియా..
బర్మింగ్ హామ్: టీమిండియా (Team India) రెండవ టెస్ట్ మ్యాచ్ ను వదిలిపెట్టలేదు. పట్టుదలగా ఆడి చరిత్ర సృష్టించారు. ఈ సారి ఇంగ్లాండ్ కు చుక్కలు చూపించారు. మొట్టమొదటి సారి ఇంగ్లండ్ మైదానంలో భారీ రన్స్ తేడాతో టెస్ట్ మ్యాచ్ గెలిచి భళా అనిపించారు. బౌలింగ్ లో బ్యాటింగ్ లో అదరగొట్టారు. రెండో టెస్టు ఆరంభం నుంచి ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఆ జట్టు.. చివరి రోజూ అదరగొట్టింది. ఆఖరి పంచ్ కూడా విజయవంతంగా విసిరింది. నిర్జీవమైన పిచ్ పై ఆకాశ్ దీప్ (6/99) సూపర్ బౌలింగ్ తో 336 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్ ను చిత్తుగా ఓడించింది. 608 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఓవర్ నైట్ స్కోరు 72/3తో చివరి రోజు, ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్.. 271 పరుగులకు ఆలౌటైంది. జేమీ స్మిత్ (88) టాప్ స్కోరర్. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 587 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్ 407 పరుగులకు ఆలౌటైంది. భారత్ రెండో ఇన్నింగ్స్ ను 427/6 వద్ద డిక్లేర్ చేసింది. గిల్ కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ విజయంతో అయిదు మ్యాచ్ ను సిరీస్ ను (India vs England) భారత్ 1-1తో సమం చేసింది. మూడో టెస్టు గురువారం లార్డ్స్ లో ఆరంభమవుతుంది. గిల్ సేన దెబ్బకు ఇంగ్లాండ్ కు గెలిచే అవకాశమే లేకుండా పోయింది. అసాధారణంగా పోరాడితే డ్రా చేసుకోవచ్చు. భారత్ ఏడు వికెట్లు పడగొడితే చాలు గెలుపు సొంతమవుతుంది. చివరి రోజు పరిస్థితిది. ఎంతో ఉత్సాహంగా సిద్ధమైన టీమ్ ఇండియాకు వర్షం ఆందోళన కలిగించింది. వాన వల్ల దాదాపు గంటన్నర ఆలస్యంగా ఆట మొదలైంది. పది ఓవర్ల ఆట పోయింది. కానీ మ్యాచ్ ఆలస్యంగా మొదలైనా.. పట్టుదలగా బౌలింగ్ చేసిన భారత్, సెషన్ లో ఆట మిగిలి ఉండగానే ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ కు తెరదించింది. బుమ్రా లాంటి మేటి పేసర్ గైర్హాజరీలో బాధ్యత తీసుకున్న ఆకాశ్ దీప్.. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆఖరి రోజు అతడి బౌలింగే హైలైట్. దాదాపు అసాధ్యమైన 608 పరుగుల లక్ష్య ఛేదనలో 72/3తో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్ ను ఆరంభంలోనే దెబ్బతీసి భారత్ ను సంబరాల్లో ముంచెత్తాడు ఆకాశ్ దీప్. మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో గిల్ ఔటైన తర్వాత టీమ్ ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. కానీ, రెండో టెస్టులో మాత్రం తన మాటలను గుర్తు పెట్టుకొని మరీ ఇంగ్లాండ్ కు చుక్కలు చూపించాడు. ఏకంగా డబుల్ సెంచరీతోపాటు, 150+ స్కోరు చేసిన ఏకైక క్రికెటర్ గా నిలిచాడు.

