సిట్‌కు ఆరా మస్తాన్ వాంగ్మూలం..పలు కీలక విషయాలు వెల్లడి
తెలంగాణలో సంచలన సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ కొనసాగుతోంది. ఆ క్రమంలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రముఖ సెఫాలజిస్టు ఆరా మస్తాన్ వాంగ్మూలాన్ని సిట్ అధికారులు బుధవారం నమోదు చేశారు. నాటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఆయన సోదరుడు కొండల్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డితో ఆరా మస్తాన్ మాట్లాడిన కాల్స్‌ను ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలోని టీం ట్యాపింగ్ ద్వారా రికార్డు చేసిందన్న విషయాన్ని మస్తాన్‌కు సిట్ అధికారులు ఆధారాలతో చూపించారు. 2023 నవంబరులో ఆరా మస్తాన్ కాంగ్రెస్ పార్టీ నేతలతో మాట్లాడిన ఫోన్ కాల్స్‌ను దర్యాప్తు అధికారులు వినిపించారు. వీటిని విన్న ఆరా మస్తాన్ షాక్‌కు గురైనట్లు తెలుస్తుంది. 2020 నుంచి మస్తాన్ ఫోన్‌ను ఎస్‌ఐబీ అధికారులు ట్యాపింగ్‌లో పెట్టారని, 2023లో మావోయిస్టుల సమాచారం కోసమంటూ ఆయన ఫోన్ నెంబర్ ట్యాపింగ్‌కు రివ్యూ కమిటీ అనుమతి తెచ్చుకున్నారని సమాచారం.
తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ రాజకీయ పార్టీల నాయకులతో మస్తాన్ మాట్లాడిన, ఆయనకు వచ్చిన ఇన్ కమింగ్ కాల్స్‌ను రికార్డు చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేయించిన వారికి తన కాల్స్‌లో ఒకటో రెండు అవసరం అవ్వవచ్చని అందుకని తన భార్యాపిల్లలతో మాట్లాడిన మాటలు కూడా రికార్డు చేయడం శోచనీయమని విచారణ తర్వాత మస్తాన్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయాలంటేనే భయపడే విధంగా కేంద్రం చట్టాన్ని తీసుకు రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సిట్ అధికారులు తనకు చాలా డేటాతో పాటు రికార్డింగ్‌లు చూపించారని, ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు అత్యంత ప్రమాదకరమని ఆయన అన్నారు.

