సింధూర మొక్క నాటిన ప్రధాని మోదీ..ఎవరిచ్చారంటే…
ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీలోని తన అధికార నివాస ప్రాంగణంలో ‘సింధూర’ మొక్కను నాటారు. ఈ మొక్కను బంగ్లాదేశ్ విముక్తి కోసం 1971లో పాకిస్థాన్తో భారత్ చేసిన యుద్ధంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన మహిళా బృందం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ మొక్కను.. పర్యావరణ దినోత్సవం సందర్భంగా నాటారు. అందుకు సంబంధించిన ఫొటోలను ‘ఎక్స్’ వేదికగా పంచుకున్న ఆయన ప్రత్యేక పోస్టు పెట్టారు. “బంగ్లాదేశ్ విముక్తి కోసం పాకిస్థాన్తో భారత్ చేసిన యుద్ధంలో కచ్‌కు చెందిన తల్లులు, సోదరీమణులు తమ వీర పరాక్రమాలను ప్రదర్శించారు. ఇటీవల నేను గుజరాత్లో పర్యటన చేసిన సమయంలో ఆ మహిళా బృందం నన్ను కలిసింది. అప్పుడే వారు నాకు ఈ మొక్కను అందించారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కను నాటారు. ప్రధానమంత్రి నివాసంలో ఈ మొక్కను నాటే గొప్ప అవకాశం నాకు దక్కినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ మొక్క మన దేశ మహిళా శక్తి, శౌర్యం, స్ఫూర్తికి బలమైన చిహ్నంగా నిలుస్తుంది” అని ప్రధాని మోదీ పోస్టు చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలను జత చేశారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు మద్దతుగా మహిళలు ఈ సింధూర మొక్కను ప్రధానికి బహుకరించారు.

