NationalNews

జన్మభూమిపై ప్రేమ పాకిస్తాన్ వెళ్లేలా చేసింది

Share with

ప్రతి ఆడపిల్లా తాను పుట్టి,పెరిగిన ఊరు, స్నేహితులు, తల్లితండ్రులు, బందువులను ఎప్పటికీ మరిచిపోలేదు. తనవాళ్లు, తాను ఆట్లాడుకున్న పరిసరాలను ఏడాదికోసారైనా వెళ్లి, చూసుకొని మురిసిపోతూ ఉంటుంది. కానీ ఆ చిన్ని కోరిక తీరని అభాగినులు ఎందరో ఉన్నారు.  ఇక ఏకంగా దేశవిభజన సమయంలో పాకిస్తాన్ వదిలి భారత్‌కు వచ్చి, ఊరిని, స్నేహితులను మరిచిపోలేని ఓ స్త్రీ తన చిన్నతనంలో ఇంటిని చూడాలనే ఆశతో 50 ఏళ్లుగా ప్రయత్నిస్తోందంటే చాలా ఆశ్చర్యం గా ఉంటుంది.  పట్టుదలతో ప్రయత్నం చేసి సాధించిన అమెకథ.. తెలుసుకుందామా…

దేశవిభజన సమయంలో పాకిస్తాన్‌లోని రావల్పిండి నుండి 15 ఏళ్ల వయస్సులో ఢిల్లీకి వచ్చేసారు రీనా కుటుంబం.ఆమెకు ఎప్పుడైనా తమ ఊరుకు వెళ్లి తన ఇంటిని చూసుకోవాలని ఆశ. అయితే వీసా దొరకలేదు. 1965 నుండి ప్రయత్నం చేయగా 2022లో వీసా దొరికింది. ఇప్పుడు ఆమెకు 90 ఏళ్ల వయస్సు. ఇప్పుడు దాదాపు 75 సంవత్సరాల అనంతరం వాఘా బోర్డర్ దాటి పాకిస్తాన్‌లో కాలు పెట్టింది. ఇది ఆమెకు ఎంత ఉద్వేగాన్నికలిగించిందో…   ఈమధ్యనే వచ్చిన సర్దార్ కా గ్రాండ్సన్ అనే హిందీ సినిమాలో నీనాగుప్తా ముఖ్యపాత్రలో వచ్చిన సినిమా కథలో మాదిరిగా ఈమె కథను కొంచెం పోల్చవచ్చు. ఆ సినిమాలో కూడా అమృత్‌సర్‌లోని  90 ఏళ్లు పైబడిన ఓవృద్దురాలి కోరికను ఆమె మనవడు ఎలా తీర్చాడన్నదే ఇతివృత్తం.  

దేశవిభజన సమయంలో అల్లర్లకు భర్త చనిపోతే, పసిబిడ్డతో సైకిల్‌పై భారత్‌కు పారిపోయి వచ్చి ఆజ్ఞాపకాలను నెమరువేసుకుంటూ గడిపే ఆమె బాధను మనవడు అర్ధం చేసుకొని, లాహోర్‌లోని ఇంటినే చక్రాలు పెట్టించి తీసుకొనిరావడం జరుగుతుంది. ఈసినిమాలో ఎమోషన్ బాగా పండింది. అయితే రీనా కథలో ఆమె రావల్పిండిలో పుట్టి, అక్కడ ప్రేమ్‌నివాస్ అనే ప్రదేశంలో ఉండేది. అక్కడి పాఠశాలలో  4 గురు తోబుట్టువులతో ఉండేది. 1932 పుట్టిన రీనాకి దేశవిభజన సమయానికి 15 ఏళ్ల వయసు. వారి ఇంటికి ముస్లింలు, సిక్కులు వచ్చిపోతుండేవారని, వారికి మతకలహాలు అంటే తెలియదని, తన తండ్రి ప్రభుత్వోద్యోగి పనిచేసేవారని, దేశవిభజన సమయంలో జరిగిన అల్లర్ల కారణంగా ఢిల్లీకి వచ్చేసామని, తొలి రిపబ్లిక్ పరేడ్‌లో పాల్గొన్నప్పుడు నెహ్రూగారిని చూసామని చెప్పిందామె. తర్వాత 1962లో ఇండో-చైనా యుద్థం తర్వాత రిపబ్లిక్ డే లో లతామంగేష్కర్ పాట విన్నామని, నెహ్రూగారి వెనుకనే కూర్చున్నామని తెలియజేసారు. ఆమె వివాహం అనంతరం  భర్తతో పాటు బెంగళూరు వచ్చి కావేరి ఎంపోరియంలో పని చేసేవారు.

అప్పటినుండి చిన్ననాటి రావల్పిండి ఒకసారైనా వెళ్లి రావాలనే కోరిక మిగిలిపోయింది. 1965లో వీసా కోసం ప్రయత్నం చేసి, విఫలమై ,1990 లో క్రికెట్ మ్యాచ్‌ల కోసం లాహోర్ వెళ్లగలిగినా, రావల్పిండి వెళ్లలేకపోయింది. ఫేస్‌బుక్ పరిచయం ద్వారా 2021 లో పాకిస్తాన్‌కు చెందిన సజ్జద్ హైదర్ అనే వ్యక్తి పంపిన తన ఇంటి ఫొటో చూసినప్పటి నుండి ఆమెకు రావల్పిండి వెళ్లాలనే కోరికి ఎక్కువయ్యింది. మరోసారి వీసాకు పట్టువదలని విక్కమార్కునిలా ప్రయత్నంచేసి, పాకిస్తాన్ హైకమిషన్ ద్వారా 3 నెలల వీసా సాధించింది. మొత్తానికి వాఘా బోర్డర్ దాటి రోడ్ మార్గంలో  పాకిస్తాన్‌లో కాలుపెట్టింది. పాకిస్తాన్‌, ఇండియా విడిపోకుండా ఉంటే బాగుండేదని, తనలాంటి వారికోసం ఇరుదేశాలు తక్షణ వీసాలు మంజూరు చేస్తే పాత మధురజ్ఞాపకాలను నెమరువేసుకుంటామని వ్యాఖ్యానించారు రీనావర్మ. భారత్, పాకిస్తాన్‌ మధ్య 60 ఏళ్లు దాటిన వారికి తక్షణవీసాలు ఇచ్చే సదుపాయం ఉంది. కానీ దానిని పాటించడం లేదు. తనకథను ఆమె సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ఈ అనుభవం ఆమెకు ఈవయస్సులో ఎంతో ఆనందం కదా.