News

సరిహద్దుల్లో ఇజ్రాయెల్ ఆగడాలు, లెబనాన్‌లో వాకీ-టాకీలతో 32 మంది హతం

అక్టోబర్ 2023లో గాజాలో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇజ్రాయెల్ మిలిటరీ, ఇరాన్-మద్దతుగల హిజ్బుల్లా సభ్యులు లెబనీస్ సరిహద్దులో ఒకరితో ఒకరు పోరాడుతున్నారు. గత రెండు రోజుల్లో లెబనాన్‌లోని కీలక ప్రాంతాల్లో హిజ్బుల్లా సభ్యులు ఉపయోగించే వాకీ-టాకీలు, పేజర్‌లు పేల్చిడంతో కనీసం 32 మంది మృతిచెందారు. 3,250 మందికి పైగా గాయపడ్డారు. తాజా దాడులతో ఇజ్రాయెల్‌ పూర్తి స్థాయి యుద్ధం దిశగా అడుగులు వేస్తోందా అన్న భయాందోళనలు వ్యక్తవుతున్నాయి. ఇరాన్-మద్దతుగల హిజ్బుల్లా సభ్యులు ఉపయోగించే వాకీ-టాకీలు బుధవారం బీరుట్ ప్రాంతంలో పేలాయి. కనీసం 20 మంది మరణించగా, 450 మందికి పైగా గాయపడ్డారు. బుధవారం నాటి పేలుళ్లలో మరణించిన వారి కోసం హిజ్బుల్లా ఏర్పాటు చేసిన అంత్యక్రియలకు సమీపంలో వాకీటాకీలపై దాడి జరిగింది. లెబనాన్‌లో హిజ్బుల్లా ఉపయోగించే వేలాది పేజర్లు పేలిన ఒక రోజు తర్వాత ఈ పేలుళ్లు సంభవించాయి.

ఇద్దరు చిన్నారులతో సహా 12 మంది నిన్న మృతి చెందగా, సుమారు 2,800 మంది గాయపడ్డారు. నేరపూరిత దురాక్రమణకు ఇజ్రాయెల్ పూర్తిగా బాధ్యత వహించాలని, అందుకు ప్రతీకారం తీర్చుకుంటామని హెజ్బుల్లా ప్రతిజ్ఞ చేసింది. పేలుళ్ల గురించి ఇజ్రాయెల్ ఇప్పటివరకు అధికారికంగా ఏ ప్రకటన చేయలేదు. హిజ్బుల్లా ఆర్డర్‌ చేసిన 5 వేల పేజర్లలో అమర్చిన పేలుడు పదార్థాలను ఆ దేశంలోకి ప్రవేశించే ముందు ఇజ్రాయెల్ గూఢచారులు రిమోట్‌గా పేల్చినట్టు భావిస్తున్నారు. ఇజ్రాయెల్ నిఘా నుండి తప్పించుకోవడానికి హిజ్బుల్లా సభ్యులు పేజర్లు, ఇతర తక్కువ-టెక్ కమ్యూనికేషన్ పరికరాలను వినియోగిస్తున్నారు. మధ్యప్రాచ్యంలో ఇరాన్ సృష్టించిన శక్తివంతమైన హిజ్బుల్లా దళాలు బుధవారం ఇజ్రాయెల్ ఫిరంగి స్థానాలపై రాకెట్లతో దాడి చేసినట్లు చెప్పాయి. అయితే ఎటువంటి నష్టం లేదా ప్రాణనష్టం జరిగినట్లు నివేదికలు లేవని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.

మరోవైపు మిడిలిస్ట్‌లో శాంతి నెలకొనాలని అమెరికా పిలుపునిచ్చింది. హెజ్బుల్లాను లక్ష్యంగా చేసుకుని పేజర్ పేలుళ్లు ద్వారా లెబనాన్‌లో నాటకీయత పెరిగే ప్రమాదం ఉందని, ఆ తీవ్రతను నివారించడానికి, ప్రపంచదేశాలు చేయాల్సిందంతా చేయాలని కోరారు. లెబనాన్‌లో పేజర్ పేలుళ్లపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి శుక్రవారం సమావేశం కానుంది.