తిరుమలలో 31 కంపార్టుమెంట్లు ఫుల్
దీపావళి, వారంతపు సెలవుల కారణంగా కుటుంబ సమేతంగా వచ్చే యాత్రికుల సంఖ్య విపరీతంగా తిరుమలలో పెరిగింది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో కొండపై ఉన్న 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 20 గంటల్లో సర్వదర్శనం దొరుకుతోందని, టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 88,076 మంది భక్తులు దర్శించుకోగా 36,829 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.52 కోట్లు ఆదాయం వచ్చిందని వెల్లడించారు. ఈనెల 5న నాగుల చవితి సందర్భంగా మలయప్పస్వామి పెద్దశేష వాహనంపై ఉభయ దేవేరులతో కలిసి దర్శనమివ్వనున్నారు.


 
							 
							