ఎన్నికలకు ముందు 26 మంది హిమాచల్ కాంగ్రెస్ నేతలు బీజేపీలోకి
హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలకు ముందు 26 మంది కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరారు. మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చేరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయ్. హిమాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి ధర్మపాల్ ఠాకూర్ ఖండ్‌తో సహా పలువురు కాంగ్రెస్ నాయకులు పార్టీ మారారు. పోలింగ్‌కు వారం రోజుల కంటే తక్కువ సమయం ఉన్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద కుదుపుగా చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్, బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇంచార్జి సుధాన్ సింగ్ సమక్షంలో నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో సిమ్లా బీజేపీ అభ్యర్థి సంజయ్ సూద్ కూడా పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ బీజేపీలోకి నేతలకు స్వాగతం పలికారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయానికి అందరం కలిసికట్టుగా పని చేయాలన్నారు. అంతకుముందు, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీని విశ్వసిస్తున్నారన్నారు. ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ తన పాలనపై ప్రశంసలు కురిపించారు జేపీ నడ్డా. క్షేత్రస్థాయిలో పాలనతో ప్రజలకు మేలు చేశారన్నారు. ప్రజలు ఉత్సాహంగా ఉన్నారని… ప్రధాని మోడీపై నమ్మకంతో ఉన్నారన్నారు. సీఎం జైరామ్ ఠాకూర్ రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో విధానాలను అమలు చేసి ప్రజలకు ప్రభత్వ ఫలాలు అందిస్తున్నారన్నారు. హిమాచల్‌లో నవంబర్ 12న ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.